నేతల ఆరోపణలపై విచారణ జరపండి : ఈసీకి, డీజీపీకి హైకోర్టు ఆదేశం

నేతల ఆరోపణలపై విచారణ జరపండి : ఈసీకి, డీజీపీకి హైకోర్టు ఆదేశం
  • ఈసీకి, డీజీపీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వచ్చిన వినతి పత్రాలను ఈ నెల 30లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒకరిపై మరొకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న అభ్యర్థులపై విచారణ జరపాలని పేర్కొంటూ నిజామాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ ఖాదర్‌  హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులైన సీఎం  కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ వంటి కీలక నేతల ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఓటర్లను మభ్య పెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నవారిపైనా చర్యలు తీసుకునేలా ఈసీ, పోలీసు అధికారులను ఆదేశించాలని తన పిటిషన్ ద్వారా కోరారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపేలా ఆర్డర్స్ ఇవ్వాలన్నారు. ఈ అంశాలపై తాను  ఈ నెల 2న డీజీపీ, 4న సీఈవోకు వినతిపత్రాలు సమర్పించినట్లు కోర్టుకు ఖాదర్‌ వివరించారు.  ఖాదర్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి బెంచ్ గురువారం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రాలను 30లోగా పరిష్కరించాలని ఈసీ, డీజీపీని ఆదేశించింది.  పిటిషన్‌లో వాదనలను ముగించింది.  నిజామాబాద్‌ నియోజకవర్గం నుంచి ఖాదర్‌ నామినేషన్‌ సమర్పించగా, రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు.