ఢిల్లీ లిక్కర్ స్కాం : విచారణ డిసెంబర్ 15కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం : విచారణ డిసెంబర్ 15కు వాయిదా

లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 25న ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ 10వేల పేజీల ఛార్జిషీట్‌ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఫైల్‌ చేసింది. ఏ1గా ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఏ2గా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఏ3గా అభిషేక్‌ బోయిన్‌పల్లి, ఏ4గా విజయ్‌ నాయర్‌, ఏ5గా అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఏ6గా సమీర్‌ మహేంద్రు, ఏ7గా ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చింది. 

అమిత్ అరోరా అరెస్ట్

ఇదే కేసుకు సంబంధించి.. ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. గురుగ్రాంకు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితులైన ముగ్గురిలో అమిత్ ఒకరు. అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా సిసోడియాకు అత్యంత సన్నిహితులు కాగా..వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.