‘మీరే ఆటోలో తీసుకురండి.. ఆ రోడ్లపై నుంచి మేం రాలేం’

‘మీరే ఆటోలో తీసుకురండి.. ఆ రోడ్లపై నుంచి మేం రాలేం’
  • కొమ్రంభీం జిల్లాలో బ్రిడ్జిపై గర్భిణి ప్రసవ ఘటనపై విచారణ 
  • అంబులెన్స్​సిబ్బంది నిర్లక్ష్యం
  • మొదటి నుంచీ పట్టించుకోని హెల్త్​సిబ్బంది
  • కనీసం వచ్చి చూడని ఏఎన్​ఎం
  • పీహెచ్​సీలో డెలివరీ జరిగినట్టు సర్టిఫికెట్​! 

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం జిల్లా బెజ్జూర్​ మండలం నాగేపల్లికి చెందిన మహిళ గురువారం చింతలమానేపల్లి మండలం కోయపల్లి సమీపంలోని బ్రిడ్జిపై మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటనపై జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు చింతలమానేపల్లి మండల పంచాయతీ ఆఫీసర్ శ్రీధర్ రాజ్, కోయపల్లి పంచాయతీ సెక్రెటరీ శివతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలు విస్తుగొలిపేలా ఉన్నాయి.  

అంబులెన్స్​కు ఫోన్​చేస్తే రామని చెప్పిన్రు

మల్లుబాయికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్​కు ఫోన్​ చేశామని, దీనికి వారు ‘మీరే ఆటోలో తీసుకురండి.. ఆ రోడ్లపై నుంచి మేం రాలేం’ అని బదులిచ్చారన్నారు. దీంతో బాధితురాలిని తీసుకొని ఊరి నుంచి ఆటోలో బయలుదేరగా, ప్రసవించిన చోటికి 4 కిలోమీటర్ల దూరంలోని గూడెం దగ్గరే అంబులెన్స్​ సిబ్బంది వాహనాన్ని ఆపేశారన్నారు. ఇంకా ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నా అక్కడికే పేషెంట్ ను తీసుకురావాలని హుకుం జారీ చేశారన్నారు. దీంతో తమ బంధువు ఒకరు టూవీలర్​ను లిఫ్ట్​ అడిగి అంబులెన్స్​ అగిన దగ్గరికే వెళ్లి రమ్మని బతిమిలాడారని చెప్పారు. ‘రోడ్లపై గుంతలున్నయ్. ఓసారి మా అంబులెన్స్ ఖరాబైంది. బండి ఇరుక్కుంటే మీదే బాధ్యత’ అని మొండికేశారన్నారు. సరే అని ఒప్పుకోవడంతోనే కోయపల్లి దగ్గర బ్రిడ్జి సమీపంలోకి వచ్చారని వాపోయారు.   

కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచీ తిప్పలే

బాధితురాలి విషయంలో ముందు నుంచీ హెల్త్ సిబ్బంది పట్టింపు లేకుండా వ్యవహరించారని తెలిసింది. పీహెచ్​సీ మల్లుబాయి డెలివరీ డేట్​ ఆగస్టు 12 అని చెప్పగా, మూడు నెలల కింద కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో స్కానింగ్ తీయిస్తే వారు జూలై 25 అని నిర్ధారించినట్టు సమాచారం. ప్రైవేట్​దవాఖానాలో రిపోర్టు ప్రకారం రెండు రోజుల ముందే నొప్పులు వచ్చాయి.  నెలలు నిండిన తర్వాత కూడా ఏఎన్ఎం వచ్చి చూడలేదు. ప్రసవించాక కూడా శుక్రవారం రాలేదు. పైగా డెలివరీ పీహెచ్ సీ లో నే చేసినట్టు బెజ్జూర్​ డాక్టర్ సర్టిఫికెట్​ ఇచ్చారు.