హైదరాబాద్ ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో చోటు దక్కించుకుంది. రుచుల నగరంగా కూడా ప్రసిద్ధికెక్కింది. దాదాపు కోటిన్నర జనాభాతో భాగ్యనగరం వరల్డ్ బెస్ట్ సిటీస్‌లో 82వ స్థానం, టేస్టీ నగరాల్లో 50వ స్థానంలో నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రత్యేక చరిత్ర, సంస్కృతిని కలిగి ఉంది. 400 ఏళ్ల చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం కాలానుసారంగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ నిర్వహించడం నగర ప్రతిష్టను మరింత పెంచింది.
ప్రసిద్ధమైన రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితా ఎంపికలో 2026 సంవత్సరానికి హైదరాబాద్ సిటీకి 82వ స్థానం లభించడం తెలంగాణకి గర్వకారణం. ఉత్తమ నగరాల జాబితా ఎంపిక కోసం 34 కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచంలోని 270 పైగా నగరాలను పరిశీలించి ఈ ర్యాంకులను ప్రకటించారు. లివబిలిటీ, లవబిలిటీ, ప్రాస్పరిటీ ప్రాతిపదికన పరిశీలించి ప్రపంచంలో అత్యుత్తమ నగరాలను ప్రకటించారు.
‘క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్’ సిటీగా పేరుగాంచిన లండన్ నగరం వరుసగా 11వసారి జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ నగరాలైన న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, మాడ్రిడ్ జాబితాలో తరువాతి ఐదు స్థానాలు పొందాయి. ప్రపంచంలోని బెస్ట్ 100 సిటీస్‌లో భారత దేశానికి చెందిన ప్రముఖ నాలుగు నగరాలు స్థానం పొందడం విశేషం. ఈ జాబితాలో బెంగళూరుకు 29వ స్థానం, ముంబైకి 40వ స్థానం, రాజధాని ఢిల్లీకి 54వ స్థానం దక్కగా, 82వ స్థానంతో హైదరాబాద్ మన దేశంలో ర్యాంకు పొందిన నాలుగో నగరంగా నిలిచింది.
బయోటెక్, ఫార్మా కంపెనీలకు ఫేమస్
దేశంలో 4వ స్థానం సాధించిన హైదరాబాద్.. చైన్నై, కోల్కత్తా మహా నగరాలను వెనక్కునెట్టి ముందంజ వేసింది. గతంలో ఎప్పుడూ బెస్ట్ సిటీ జాబితాలో చోటు దక్కని హైదరాబాద్ ఇప్పుడు 100 నగరాల్లో ఒకటిగా నిలవడం విశేషం. ఐటీ, టెక్నాలజీ హబ్, బయో ఫార్మా రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రాత్మక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అదనపు బలం చేకూర్చాయి. నగరంలో ఆర్థిక సౌలభ్యం అన్ని వర్గాలవారికి అనుకూలంగా ఉందని వరల్డ్ బెస్ట్ సిటీస్ నివేదిక పేర్కొంది. హైటెక్ సిటీ, మెక్రోసాఫ్ట్, గూగుల్ క్యాంపస్, అమెజాన్, ఫార్చూన్ కంపెనీలతోపాటు సాంకేతికంగా హైదరాబాద్‌లోని టీ హబ్ ప్రపంచంలో ప్రముఖ ఇన్నోవేషన్ క్యాంపస్ గా గుర్తింపు పొందింది.
పెట్టుబడులను ఆకర్షిస్తున్న‘ఫ్యూచర్ సిటీ’
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలకు అదనంగా ఇప్పుడు ‘ఫోర్త్ సిటీ’ కూడా నిర్మాణమవుతోంది. ఈ నూతన నగరాన్ని వ్యాపారవేత్తలకు అనువుగా సకల సౌకర్యాలతో 30 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. నగర శివార్ల పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆరు మండలాలను ఫ్యూచర్ సిటీ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ ఐటీతో పాటు ఇతర రంగాలకు కూడా ప్రాధాన్యతిస్తున్నారు. యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఈవీ బస్సుల తయారీ యూనిట్, టెక్స్‌టైల్ పరిశ్రమలు, ప్రతిష్టాత్మమైన విద్యా సంస్థలు, ప్రముఖ రెస్టారెంట్లు, రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్లు రానున్నాయి.
ప్రజా రవాణాకు ప్రాధాన్యత
ఇందులో భాగంగా నగరంలో మెట్రో రైలు విస్తరణకు ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటిని వేగవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మూడు మార్గాల్లో దాదాపు 69 కి.మీలలో 57 స్టేషన్లతో సగటున రోజూ 5 లక్షలకుపైగా ప్రయాణికులకు సేవలందిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును రెండో దశలో మరో 75 కిమీలపైగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండో దశలో మెట్రో కోసం సుమారు 18 వేల కోట్ల రూపాయల అంచనాతో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం కోసం వేచిచూస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
జీహెచ్‌ఎంసీలో 20 మున్సిపాల్టీలు, 7 కార్పొరేష్లన్ల విలీనం ప్రక్రియను ప్రారంభించింది. దీంతో 2000 చ.కి.మీలకు పైగా విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. ఇప్పటికే నగరంలో కోటిన్నర దాటిన జనాభా ఇకపై దాదాపు రెండు కోట్ల వరకు చేరనుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగం గ్రేటర్ పరిధిలోనే ఉండబోతోంది. బృహత్ నగరంతో ప్రపంచంలోని టాప్ టెన్ మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ కూ చోటు దక్కబోతుంది.
జనాభా పరంగా భారతదేశంలో మొదటి మూడు నగరాల స్థానాల్లో హైదరాబాద్ నిలవనుంది. ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటివరకు మన దేశానికి సంబంధించి ఢిల్లీ, ముంబై నగరాలకే చోటు ఉండగా ఇకపై గ్రేటర్ హైదరాబాద్‌కు కూడా స్థానం దక్కనుంది. హైదరాబాద్ మకుటంలో ఇప్పుడు విశేషమైన వరల్డ్ బెస్ట్ సిటీ, టేస్టీ సిటీ అవార్డులు కూడా చేరడంతో ఈ బృహత్ నగరం ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
రుచుల్లో ప్రజాభిమానం
ఆర్థిక, వ్యాపార, సాంకేతిక రంగాల్లో ప్రజాదరణ పొందుతున్న హైదరాబాద్ రుచుల్లో కూడా ప్రజాభిమానం పొందుతోంది. తాజాగా ‘టేస్టీ అట్లాస్’ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలో హైదరాబాద్ నగరానికి 50వ స్థానం దక్కడం విశేషం. దేశంలోని భిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు కొలువైన హైదరాబాద్‌లో మొఘలాయి, అరబిక్, టర్కిష్, పర్షియన్, వంటకాలతోపాటు సంప్రదాయ వంటకాలు కూడా భోజన ప్రియులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
నగరానికి ప్రత్యేకమైన హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీమ్, ఉస్మానియా బిస్కెట్ దేశ విదేశీయులు ఇష్టపడుతున్నారని ‘టేస్టీ అట్లాస్’ నివేదిక పేర్కొంది. అన్ని రకాల రుచుల ధరలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండడం హైదరాబాద్ నగరం ప్రత్యేకత. టేస్టీ అట్లాస్ జాబితాలో భారత దేశంలోని నాలుగు నగరాలకు స్థానం దక్కింది. ప్రఖ్యాత టేస్టీ అట్లాస్ వంటి వేదికలపై హైదరాబాద్ వంటకాలకు ప్రశంసలు అందడంతో సిటీలో ఫుడ్ కల్చర్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడబోతోంది.
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, సీనియర్ జర్నలిస్ట్

