లక్ష్మీ విలాస్ బ్యాంక్ కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు

లక్ష్మీ విలాస్ బ్యాంక్ కు షాకిచ్చిన ఇన్వెస్టర్లు

సీఈఓ సహా మొత్తం ఏడుగురు డైరెక్టర్ల అపాయింట్​మెంట్​కు నో చెప్పిన షేర్‌‌హోల్డర్లు

వాళ్లు వద్దే వద్దంటున్న షేర్ హోల్డర్లు

ఆడిటర్ నూ ఇంటికి పంపారు.. ముగ్గురు డైరెక్టర్లకే యెస్

లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఇన్వెస్టర్లు షాకిచ్చారు. పది మంది డైరెక్టర్లలో ఏడుగురి అపాయింట్‌మెంట్‌ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. సీఈఓ, ఆడిటర్‌‌ను కూడా ఓటిం గ్‌ ద్వారా తొలగించారు. వీరి పనితీరు బాగాలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. షేర్‌‌హోల్డర్లకు సంస్థ ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెరుగుతుందనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ఎక్స్‌‌పర్టులు చెబుతున్నారు. ఒకేసారి ఏడుగురు డైరెక్టర్లను, సీఈఓను తీసేయడం అసాధారణమని అంటున్నారు. ఆన్‌‌లైన్‌‌ ఓటింగ్‌ కాబట్టి షేర్‌‌హోల్డర్లు ధైర్యంగా ఓటేయగలిగారని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌ యాన్యువల్‌‌ జనరల్‌‌ మీటింగ్‌‌లో షేర్‌‌ హోల్డర్లు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులో కొత్త నియామకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఏడుగురు కొత్త డైరెక్టర్లు, సీఈఓలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఎస్‌‌.సుందర్‌‌ (ఎండీ, సీఈఓ),డైరెక్టర్లుగా ఎన్‌‌.సాయిప్రసాద్‌, జి.జగన్‌‌మోహన్‌‌ రావు, రఘురాజ్‌‌ గుజ్జర్‌‌, కేఆర్ ప్రదీప్‌, బీకే మంజునాథ్‌, వైవీ లక్ష్మీనారాయణ మూర్తిలను నియమించాలన్న ప్రపోజల్‌‌ తిరస్కరించారని లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌ ద్వారా వెల్లడించింది. అయితే శక్తి సిన్హా, సతీశ్‌ కుమార్‌‌ కల్రా, మీతా మోహన్‌‌లను డైరెక్టర్లుగా నియమించాలన్న తీర్మానానికి అనుకూలంగా ఓటేశారని ప్రకటించింది. ఈ విషయమై ఇన్‌‌స్టిట్యూ షనల్‌‌ ఇన్వెస్టర్‌‌ అడ్వైజరీ (ఐఐఏఎస్‌‌) మెంబర్‌‌ ఒకరు మాట్లాడుతూ ఈ డైరెక్టర్లు బాధ్యత లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. బ్యాంకు నష్టాలకు కొంతమంది నాన్–ఇండిపెండిండ్‌‌ డైరెక్టర్లు కూడా కారణమని షేర్ హోల్డర్లకు పంపిన వోటింగ్‌‌ అడ్వైజరీలో ఐఐఏఎస్‌‌ స్పష్టం చేసింది. రికవరీ కోసం బ్యాంకు చర్యలు తీసుకునేలా ఆర్‌‌బీఐ కలుగజేసుకోవాలని సూచించింది. ఇది వరకటి సీఈఓ పార్థసారథి ముఖర్జీ గత ఏడాది ఆగస్టులో రాజీనామా చేశాక, సుందర్‌‌ ఈ ఏడాది జనవరిలో సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు.

పెరుగుతూనే ఉన్న సమస్యలు

లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌లో చాలా కాలం నుంచి సమస్యలు ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. క్యాపిటల్ అడుగంటుతోంది. నష్టాలు పేరుకుపోతున్నా యి. కొత్త ఇన్వెస్టర్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్‌‌ కావడం లేదు. ప్రస్తుతం బ్యాంక్‌‌ మేనేజ్‌‌మెంట్‌ క్లిక్స్‌‌ క్యాపిటల్‌‌తో విలీనంపై చర్చలు జరుపుతోంది. డ్యూడెలిజెన్స్‌‌ కోసం ఆర్‌‌బీఐ ఇచ్చిన గడువు కూడా ముగిసింది. కరోనా వల్లే పనులు ఆలస్యం అయ్యాయని లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌ వివరణ ఇచ్చింది. ఇండియాబుల్స్ హౌజింగ్‌‌ ఫైనాన్స్‌‌తో గతంలో జరిపిన చర్చలు సక్సెస్‌‌ అయ్యాయి. అయితే అప్పుడు విలీనానికి ఆర్‌‌బీఐ ఒప్పుకోలేదు. ఈ ఏడాది జూన్‌‌ లెక్కల ప్రకారం బ్యాంక్‌‌ టైర్‌‌–1 క్యాపిటల్‌‌ రేషియో నెగెటివ్‌ లోకి వెళ్లి –0.88 శాతంగా రికార్డయింది. ఆర్‌‌బీఐ రూల్స్‌‌ ప్రకారంఇది కనీసం 8.875 శాతం ఉండాలి. మొండిబాకీలు కూడా విపరీతంగా పెరిగాయి. గ్రాస్‌‌, నెట్​ ఎన్‌‌పీఏ రేషియోలు ఎక్కువ ఉన్నాయి.

‘‘ప్రైవేటు బ్యాంకుల షేర్‌‌‌‌హోల్డర్లు చురుగ్గా వ్యవహరిస్తు న్నారని, వారికి కంపెనీపై పట్టుపెరుగుతోందని చెప్పడానికి ఎల్‌‌‌‌వీబీ సంఘటన నిదర్శనం. బ్యాంకులను సరిగ్గా నడపలేని మేనేజ్‌మెంట్‌ ను తమ కంట్రోల్‌‌‌‌లోకి తీసుకోవడానికి ఇన్‌ స్టి ట్యూషనల్‌‌‌‌ ఇన్వెస్టర్స్‌ వెనుకాడటం లేదు. ఇది మంచి పరిణామం. కార్పొరేట్‌ డెమోక్రసీ మరింత బలపడుతోంది. ఇన్‌ సాల్వెన్సీ కోడ్‌ వచ్చాక లెండర్ల సత్తా ఏంటో తెలిసిపోతోంది’’ -పీఎస్‌‌‌‌ శాస్త్రి, క్వింటసెన్స్ ఎంటర్ ప్రైజెస్.

డిపాజిటర్ల డబ్బుకు ఢోకా లేదు

తాజా పరిస్థితులపై బ్యాం కు మేనేజ్ మెంట్‌ ఆదివారం సాయత్రం ఒక ప్రకటన చేసింది. డిపాజిట్ల డబ్బుకు ఎలాంటి ఢోకా లేదని, తమ వద్ద తగినన్ని ఫండ్స్‌ ఉన్నా యని పేర్కొంది. లిక్విడిటీ కవరేజ్‌ రేషియో 250 శాతానికిపైగా ఉందని, ఆర్ బీఐ రూల్స్‌ ప్రకారం ఇది 100 శాతం ఉంటే చాలని తెలియజేసింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 72.6 శాతం ఉందని, వాస్తవానికి ఇది 70 శాతం ఉంటే సరిపోతుందని ప్రకటించింది. కొత్త ఎండీ వచ్చే దాకా ప్రస్తుత సీనియర్‌ మేనేజ్మెంట్‌ టీమ్‌ రోజువారీ వ్యవహారాలను చూసుకుంటుందని పేర్కొంది.