
నేడు చెన్నై, కోల్కతా మధ్య తొలి మ్యాచ్
రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
ముంబై: డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్, నిరుడు రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరులో గెలిచి లీగ్ లో బోణీ కొట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతుండటం మరో విశేషం. సీజన్ కు రెండు రోజుల ముందు కెప్టెన్ గా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ధోనీ.. జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దీంతో ఇప్పటివరకు ఫుల్ టైమ్ కెప్టెన్ గా అనుభవం లేని జడ్డూ ఈసారి టీమ్ ను ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిరుడు ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఫైనల్ వరకు వెళ్లిన కేకేఆర్.. ఈసారి అతడిని వేలానికి ముందే వదిలేసింది. ఆ తర్వాత వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుని అతడికి కెప్టెన్సీ అప్పగించింది. ఇంతకుముందు 2020లో ఢిల్లీకి కెప్టెన్ గా టీమ్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన అయ్యర్ పై మంచి అంచనాలున్నాయి.