ఉప్పల్‌ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఉప్పల్‌ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

హైదరాబాద్‌ : ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 16 సీజన్‌ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఏప్రిల్ 2న సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ -రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ జట్టు ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్‌సీఏ ప్రతినిధులతో రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్ సమీక్ష నిర్వహించారు. 

ఉప్పల్ స్టేడియంలో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని  సీపీ డి.ఎస్. చౌహాన్ చెప్పారు.  ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు అందిస్తామన్నారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

టికెట్ల పంపిణీలో గందరగోళం తలెత్తకుండా సన్‌ రైజర్స్ యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్ కోరారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అంతా...పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు.