ఐపీఎల్ టోర్నీ నుండి పంజాబ్ ఔట్.. 9వికెట్ల తేడాతో చెన్నై విక్టరీ

ఐపీఎల్ టోర్నీ నుండి పంజాబ్ ఔట్.. 9వికెట్ల తేడాతో చెన్నై విక్టరీ

పోతూ పోతూ పంజాబ్ ను వెంట తీసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్

అబుదాబీ: ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ ఖేల్ ఖతం అయింది. టోర్నీ ప్రారంభమైనప్పటి నుండి చెత్తగా ఆడుతూ.. ప్లే ఆఫ్ రేసులో నిలబడతామన్న ఆశలే లేకుండా చేసుకున్న ధోనీ సేన ఎట్టకేలకు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను చిత్తుగా ఓడించింది. కీలకమైన ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలబడాలని ఎంతో ఆశగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టును చెన్నై చావు దెబ్బకొట్టింది. ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ తనతోపాటే పంజాబ్ జట్టును కూడీ  టోర్నీ నుండి వెంట బెట్టుకుని తీసుకెళ్లింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు నాకౌట్ అవకాశాలకు తెరపడింది. ఓవరాల్ గా ఈ జట్టు ఐదోస్థానంలో నిలిచింది.
కీలకంగా మారిన టాస్

పంజాబ్, చెన్నై జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ కీలకంగా మారింది. టోర్నీలో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో  చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. బౌలర్లు ఫీల్డ్ లోని తేమ కారణంగా బంతిపై పట్టు కోల్పోతుండడంతో సెకండ్ బ్యాటింగ్ కు బరిలోకి దిగి ఛేజింగ్ చేసే జట్లకు లాభిస్తోంది. ఇదే కోవలోనే పంజాబ్ బౌలర్లు బంతిపై పట్టు సాధించలేక అవస్థలు పడ్డారు.  చెన్నై టాపార్డర్ ఉతికి ఆరేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. టార్గెట్ పెద్దగా లేకపోవడంతో ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి  154 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లు ఇద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతూ.. పంజాబ్ కు చుక్కలు చూపించారు.  యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 49 బంతుల్లో 62 పరుగులు చేయగా, మరో ఓపెనర్ డుప్లెసిస్ 34 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. మన తెలుగుతేజం అంబటి రాయుడు నిలకడగా ఆడి  30 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు విజయానికి ఢోకా లేకుండా చేశాడు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ లభించింది.