అతడి షాట్లు యువరాజ్‌‌ను గుర్తుకు తెస్తున్నాయ్

అతడి షాట్లు యువరాజ్‌‌ను గుర్తుకు తెస్తున్నాయ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో పలువురు యంగ్ ఇండియన్ ప్లేయర్లు ఆకట్టుకుంటున్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణోయ్ లాంటి ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ దేవ్‌‌దత్ పడిక్కల్ కూడా తన బ్యాటింగ్‌‌ స్కిల్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఐపీఎల్‌లో 400కు పైగా పరుగులు చేసిన రెండో అన్‌‌క్యాప్డ్ ప్లేయర్‌‌గా పడిక్కల్ నిలిచాడు. పడిక్కల్ బ్యాటింగ్ గురించి వెటరన్ టీమిండియా పేసర్ వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడాడు. అండర్-19 నేషనల్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌‌గా ఉన్న సమయంలో పడిక్కల్ ట్యాలెంట్‌‌ను వెంకటేశ్ ప్రసాద్ గుర్తించాడు. అతడికి మంచి భవిష్యత్ ఉందని వెంకటేశ్ ప్రసాద్ చెప్పాడు.

‘ఇవి పడిక్కల్‌‌కు తొలి అడుగులు మాత్రమే. ఎందుకంటే ఓ ప్లేయర్‌‌‌‌కు అసలైన కఠిన పరీక్ష ఒత్తిడిలో, కఠిన పరిస్థితుల్లో ఆడినప్పుడే ఎదురవుతుంది. ఆ సమయంలో అతడు తప్పక రాణించాలి. ఈ ఐపీఎల్‌‌లో పడిక్కల్ ఒత్తిడిని చాలా సమర్థంగా అధిగమించాడు. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్‌‌తో ఫాన్స్ దృష్టిని, మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అతడికి మంచి ఫ్యూచర్ ఉంది. టీమిండియాలో ఎక్కువ మంది లెఫ్టాండర్ బ్యాట్స్‌‌మెన్‌‌లు లేరు. సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ లాంటి అత్యద్భుత ప్లేయర్లను మినహాయిస్తే గ్రేట్ లెఫ్టాండర్లు కనిపించరు. పడిక్కల్ ఆడిన కొన్ని షాట్లు యువరాజ్ సింగ్ టీ20ల్లో కొట్టిన మాదిరిగానే ఉన్నాయి. ముఖ్యంగా పుల్ షాట్‌‌లు అయితే అచ్చం యువీ కొట్టినట్లుగానే ఉన్నాయి. ఫిట్‌‌నెస్‌‌తోపాటు బ్యాటింగ్ మెరుగుపై పడిక్కల్ మరింత ఫోకస్ పెడితే చాలా ముందుకెళ్తాడు. లెఫ్టాండర్‌‌ అవ్వడం అతడికి మరో సానుకూల అంశం. క్రమశిక్షణతో ఉంటే పడిక్కల్ మరిన్ని అవకాశాలను పొందొచ్చు’ అని వెంకటేశ్ ప్రసాద్ చెప్పాడు.