సీఎస్​కే టాప్‌ షో..బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ

సీఎస్​కే టాప్‌ షో..బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ


షార్జా: అరబ్‌‌ గడ్డపై చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ జోరు కొనసాగుతోంది.  బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో అదరగొట్టడంతో ఫేజ్‌‌–2లో వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌‌లో చెన్నై  ఆరు వికెట్ల తేడాతో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరును చిత్తు చేసి టేబుల్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. అద్భుత ఆరంభం లభించినా.. మిడిలార్డర్‌‌ చేతులెత్తేయడంతో కోహ్లీసేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఆర్‌‌సీబీ 20 ఓవర్లలో  156/6 స్కోరు చేసింది. దేవదత్‌‌ పడిక్కల్‌‌(50 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), విరాట్‌‌ కోహ్లీ(41 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 53) హాఫ్‌‌ సెంచరీలు చేశారు. చెన్నై బౌలర్లలో డ్వేన్‌‌  బ్రావో(3/24) మూడు, శార్దూల్‌‌ ఠాకూర్‌‌(2/29) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో 18.1 ఓవర్లు ఆడిన చెన్నై 157/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌(26 బాల్స్‌‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌‌తో 38), డుప్లెసిస్‌‌(26 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31), అంబటి రాయుడు(22 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32) రాణించారు. ఆర్‌‌సీబీ బౌలర్లలో హర్షల్‌‌ పటేల్‌‌(2/25) రెండు వికెట్లు తీశాడు. బ్రావోకు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

ఆరంభం అదుర్స్‌‌..డెత్‌‌లో ఢమాల్‌‌..

టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్‌‌సీబీకి..కెప్టెన్‌‌ కోహ్లీ, పడిక్కల్‌‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 111 రన్స్‌‌ జోడించిన వీరిద్దరూ భారీ స్కోరుకు బాటలు వేశారు. కానీ డెత్‌‌ ఓవర్లలో వరుస విరామాల్లో  వికెట్లు కోల్పోయిన ఆర్‌‌సీబీ నార్మల్‌‌ స్కోరుకే పరిమితమైంది. తొలుత కోహ్లీ, పడిక్కల్‌‌.. చెన్నై బౌలర్లతో ఆట ఆడుకున్నారు. ఇన్నింగ్స్‌‌ తొలి రెండు బాల్స్‌‌ను బౌండ్రీకి తరలించిన ఓపెనర్‌‌ కోహ్లీ.. సూపర్‌‌ స్టార్ట్‌‌ ఇవ్వగా..పడిక్కల్‌‌ కూడా ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాడు. దీంతో  పవర్‌‌ ప్లే ముగిసే సరికి ఆర్‌‌సీబీ 55/0పై నిలిచింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో తొలుత పడిక్కల్‌‌, తర్వాత కోహ్లీ  ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నారు. కానీ, 14వ ఓవర్‌‌లో విరాట్‌‌ను ఔట్‌‌ చేసిన బ్రావో చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. దీంతో డివిలియర్స్‌‌(12) క్రీజులోకి రాగా ఆర్‌‌సీబీ భారీ స్కోరు దిశగానే సాగింది. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలో చెన్నై బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు.  17వ ఓవర్‌‌లో డివిలియర్స్‌‌, పడిక్కల్‌‌ను  వరుస బాల్స్‌‌లో ఔట్‌‌ చేసి ఠాకూర్‌‌ ఆర్‌‌సీబీకి  డబుల్‌‌షాకిచ్చాడు.ఇక, చివరి మూడు ఓవర్లలో 16 రన్స్‌‌ చేసి  డేవిడ్‌‌(1), మ్యాక్స్‌‌వెల్‌‌(11), హర్షల్‌‌ పటేల్‌‌(3) వికెట్లు కోల్పోయిన ఆర్‌‌సీబీ ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యం ఉంచగలిగింది. ఇందులో రెండు వికెట్లు బ్రావోకు దక్కాయి.

అదరగొట్టిన చెన్నై..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో చెన్నైకి మంచి ఆరంభం దొరికింది. ధనాధన్‌‌ ఆటతో అలరించిన చెన్నై ఓపెనర్లు  గైక్వాడ్‌‌, డుప్లెసిస్‌‌ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 50 బాల్స్‌‌లోనే 71 రన్స్‌‌ జోడించి గెలుపు బాట చేశారు. వరుస  షాట్లతో  పవర్‌‌ ప్లేలో  59 రన్స్‌‌ చేసిన ఈ జోడీని తొమ్మిదో ఓవర్‌‌లో చహల్‌‌ విడదీశాడు. బ్యాక్‌‌వర్డ్‌‌ పాయింట్‌‌లో గైక్వాడ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను కోహ్లీ కళ్లు చెదిరే డైవ్‌‌తో అందుకున్నాడు.ఇక, మాక్స్‌‌వెల్‌‌ వేసిన తర్వాతి ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే డుప్లెసిస్‌‌ కూడా ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై  78/2పై నిలిచింది. ఓపెనర్లు వెంటవెంటనే ఔటైనా అంబటి రాయుడు, మొయిన్ అలీ (23)  మూడో వికెట్‌‌కు 30 బాల్స్‌‌లో 47 రన్స్‌‌ జోడించి చెన్నైని లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. అయితే వీరిద్దరిని తన వరుస ఓవర్లలో ఔట్‌‌ చేసిన హర్షల్‌‌.. చెన్నైని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికి  చెన్నై విక్టరికీ చివరి 24 బాల్స్‌‌లో 23 రన్స్‌‌ అవసరం కాగా రైనా(17 నాటౌట్‌‌), ధోనీ(11 నాటౌట్‌‌) ఎలాంటి డ్రామాకు తావు లేకుండా మ్యాచ్‌‌ పూర్తి చేశారు.  హసరంగ(17వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో వరుసగా ఫోర్‌‌, సిక్స్‌‌ కొట్టిన రైనా ఒత్తిడి లేకుండా చేస్తే.. ఆ తర్వాత సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు కొట్టిన ధోనీ చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు:  20 ఓవర్లలో 156/6 ( పడిక్కల్‌‌ 70, కోహ్లీ 53 , బ్రావో 3/24)
చెన్నై: 18.1 ఓవర్లో 157/4 ( రుతురాజ్‌‌ 38, రాయుడు 32, హర్షల్‌‌ 2/25).