ఆడుతూ.. పాడుతూ అలవోకగా గెలిచిన ఢిల్లీ

ఆడుతూ.. పాడుతూ అలవోకగా గెలిచిన ఢిల్లీ
  •  అదరగొట్టిన శిఖర్‌‌‌‌ ధవన్‌‌
  • 6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌పై విక్టరీ

ముంబై: ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ (49 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92)  సహా ఇతర బ్యాట్స్‌‌మెన్‌‌ సత్తా చాటడంతో ఐపీఎల్‌‌–14 లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఇక్కడి జరిగిన మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ కింగ్స్‌‌ నిర్దేశించిన 196 రన్స్‌‌ టార్గెట్‌‌ను అలవోకగా పూర్తి చేసి న ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.  ఈ మ్యాచ్‌‌లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 రన్స్‌‌ చేసింది. మయాంక్‌‌ అగర్వాల్‌‌ (36 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (51 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) ధనాధన్‌‌ హాఫ్‌‌ సెంచరీలతో సత్తాచాటారు.  అనంతరం ఛేజింగ్‌‌లో18.2  ఓవర్లు ఆడిన ఢిల్లీ 198/4 రన్స్‌‌ చేసి మ్యాచ్‌‌ గెలిచింది.  పృథ్వీ షా(32), స్టోయినిస్‌‌ (27 నాటౌట్‌‌) రాణించారు.  
మయాంక్‌‌ మాస్‌‌, రాహుల్‌‌ క్లాస్‌‌.. 
టాస్ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌కు ఓపెనర్లు మయాంక్‌‌, కెప్టెన్‌‌ రాహుల్ అదిపోయే ఆరంభం ఇచ్చారు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 76 బాల్స్‌‌లో 122 పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేశారు.  మయాంక్‌‌ మాస్‌‌ బ్యాటింగ్‌‌తో చెలరేగితే.. రాహుల్‌‌ తన మార్కు క్లాస్‌‌ ఇన్నింగ్స్‌‌తో హాఫ్‌‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.  ఎదుర్కొన్న తొలి బాల్‌‌నే బౌండ్రీకి తరలించిన మయాంక్‌‌.. మెరీవాలా వేసిన ఇన్నింగ్స్‌‌ రెండో ఓవర్‌‌లో20 రన్స్‌‌ పిండుకున్నాడు. మయాంక్‌‌ దూకుడు కొనసాగించగా రాహుల్‌‌ కూడా వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు కొట్టడంతో పవర్‌‌ ప్లే ముగిసే సరికి పంజాబ్‌‌ 59/0పై నిలిచింది. అశ్విన్‌‌ వేసిన  తొమ్మిదో ఓవర్‌‌లో 6, 4 కొట్టిన మయాంక్‌‌.. అవేశ్‌‌ ఖాన్‌‌ వేసిన తర్వాతి ఓవర్‌‌లో మరో ఫోర్‌‌ కొట్టి ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. రబాడ వేసిన 11వ ఓవర్‌‌లో  మూడు సిక్సర్లు సహా 20 రన్స్‌‌ రాబట్టిన మయాంక్‌‌–రాహుల్ జోడీ... జట్టు స్కోరును వంద దాటించింది. 12వ ఓవర్‌‌లో ఆరు రన్స్‌‌ రాగా..13వ ఓవర్‌‌లో మయాంక్‌‌ వికెట్‌‌ తీసిన లుక్మన్‌‌ .. ఢిల్లీకి బ్రేక్‌‌ ఇచ్చాడు. దీంతో పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ రన్‌‌రేట్‌‌ను కట్టడి చేశారు. రబాడ (16వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో రాహుల్‌‌ క్యాచ్‌‌ ఔటవ్వగా.. క్రిస్ గేల్‌‌(11)ను వోక్స్‌‌ వెనక్కి పంపాడు. నికోలస్‌‌ పూరన్‌‌ (9)ను అవేశ్‌‌ ఖాన్‌‌ ఔట్‌‌ చేశాడు. అయితే దీపక్‌‌ హుడా(22 నాటౌట్‌‌) ఓ వైపు ఉండగా.. వోక్స్‌‌ వేసిన లాస్ట్‌‌ ఓవర్‌‌లో 4, 4, 6  సహా 16 రన్స్‌‌ రాబట్టిన షారుఖ్‌‌ ఖాన్‌‌ (15 నాటౌట్‌‌)  పంజాబ్‌‌ ఇన్నింగ్స్‌‌కు   ఫినిషింగ్‌‌ టచ్‌‌ ఇచ్చాడు.  
గబ్బర్‌‌ గర్జన..
టార్గెట్‌‌ కాపాడుకోవడంలో పంజాబ్‌‌కు ఏదీ కలిసిరాలేదు. ఢిల్లీ బ్యాట్స్‌‌మెన్‌‌ దూకుడు ముందు పంజాబ్‌‌ బౌలర్లు తేలిపోయారు. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 33 బాల్స్‌‌లో 62 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేసిన ఓపెనర్లు భారీ ఛేజింగ్‌‌లో ఢిల్లీకి మంచి స్టార్ట్‌‌ ఇచ్చారు. ధవన్‌‌‌‌‌‌ కాస్త ఆచితూచి ఆడగా పృథ్వీ ఎదురుదాడికి దిగాడు,   ధవన్‌‌‌‌ కూడా స్పీడ్‌‌‌‌ అందుకోవడంతో ఐదు ఓవర్లు ముగియకముందే ఢిల్లీ 50 రన్స్‌‌‌‌ మార్కు దాటేసింది. అయితే, పవర్‌‌‌‌ ప్లే లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో పృథ్వీని ఔట్‌‌‌‌చేసి అర్షదీప్‌‌‌‌ పంజాబ్‌‌‌‌కు బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. పవర్‌‌‌‌ప్లే ముగిసే పరికి ఢిల్లీ 62/1 పై నిలిచింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (9) సింగిల్స్‌‌‌‌కు పరిమితమవ్వగా.. వీలుచిక్కినప్పుడల్లా బాల్‌‌‌‌ను బౌండ్రీ దాటించిన ధవన్‌‌‌‌ రన్‌‌‌‌రేట్‌‌‌‌ పడిపోకుండా చూశాడు. ఈ క్రమంలో హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా కంప్లీట్‌‌‌‌ చేశాడు. మెరిడిత్‌‌‌‌ వేసిన 11వ ఓవర్‌‌‌‌లో స్మిత్‌‌‌‌ ఔటైనా...  రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (15)తో కలిసి ధవన్‌‌‌‌ దూకుడు కొనసాగించాడు. .మెరిడిత్‌‌‌‌ వేసిన 14 ఓవర్‌‌‌‌లో  హ్యాట్రిక్‌‌‌‌ బౌండ్రీలు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. కానీ తర్వాతి ఓవర్‌‌‌‌లో రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌ (15వ ఓవర్‌‌‌‌) గబ్బర్‌‌‌‌ను  క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. దీంతో పంజాబ్‌‌‌‌ మళ్లీ మ్యాచ్‌‌‌‌లోకి వచ్చింది. చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 రన్స్‌‌‌‌ అవసరమవగా..  షమీ వేసిన 17వ ఓవర్‌‌‌‌లో 16 రన్స్‌‌‌‌ రాబట్టిన పంత్‌‌‌‌–స్టోయినిస్‌‌‌‌ (27 నాటౌట్‌‌‌‌) జోడీ మ్యాచ్‌‌‌‌ను తమవైపు లాగేసుకుంది. రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌ (18వ ఓవర్‌‌‌‌) బౌలింగ్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసి పంత్‌‌‌‌ ఔటైనా.. లలిత్‌‌‌‌ యాదవ్‌‌‌‌(12 నాటౌట్‌‌‌‌)తో కలిసి స్టోయినిస్‌‌‌‌ లాంఛనం పూర్తి చేశాడు. 
సంక్షిప్త స్కోర్లు: పంజాబ్‌‌ కింగ్స్‌‌ 195/4 (మయాంక్‌‌ 69, రాహుల్‌‌ 61,  క్రిస్‌‌ వోక్స్‌‌ 1/32). ఢిల్లీ క్యాపిటల్స్‌‌  198/4 (శిఖర్‌‌ ధవన్‌‌ 92, స్టోయినిస్‌‌ 27 నాటౌట్‌‌, రిచర్డ్‌‌సన్‌‌ 2/41).