
దుబాయ్: వరుసగా రెండు ఓటముల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపు రుచి చూసింది. ఈ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్ హర్షల్ పటేల్ (4/17) హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీయడంతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ ఆరో విక్టరీ ఖాతాలో వేసుకుంది. వరుసగా మూడో, ఓవరాల్‌గా ఆరో ఓటమి ఏడో ప్లేస్‌కు దిగజారిన ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 54 రన్స్ తేడాతో ముంబైపై గెలిచింది. తొలుత మ్యాక్స్‌వెల్ (37 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56), విరాట్ కోహ్లీ (42 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) ఫిఫ్టీలు బాదడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 165/6 స్కోరు చేసింది. కేఎస్ భరత్ (32) కూడా రాణించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా (3/36) మూడు వికెట్లు తీశాడు. ఆపై, హర్షల్‌కు తోడు యుజ్వేంద్ర చహల్ (3/11), మ్యాక్స్‌వెల్ (2/23) దెబ్బకు ఛేజింగ్‌లో ముంబై 18.1 ఓవర్లలో 111కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. రోహిత్ (43), డికాక్ (24) తప్ప మిగతా తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. మ్యాక్స్‌వెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
కోహ్లీ, మ్యాక్సీ మోత
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పడిక్కల్ (0) బుమ్రా బౌలింగ్‌లో డకౌటయ్యాడు. అయితే, కేఎస్ భరత్‌తో కలిసి రెండో వికెట్‌కు 68 రన్స్ జోడించిన కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో భరత్ ఔటవడంతో కోహ్లీకి తోడైన మ్యాక్స్‌వెల్ స్విచ్ హిట్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత 16వ ఓవర్లో కోహ్లీ వెనుదిరిగినా మాక్సీ జోరు తగ్గలేదు. మిల్నే వేసిన 18వ ఓవర్లో 6, 4, 4తో 17 రన్స్ రాబట్టి స్కోరు 150 దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లో మ్యాక్సీ, డివిలియర్స్ (11)ను ఔట్ చేసిన బుమ్రా ఆర్‌సీబీ స్పీడుకు బ్రేకులేశాడు. లాస్ట్ ఓవర్లో మిల్నే 3 రన్సే ఇచ్చాడు.
ముంబై ఢమాల్
నార్మల్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్లు రోహిత్, డికాక్ మంచి పునాది వేసినా మిడిలార్డర్ ఫెయిల్యూర్‌తో ముంబై చేజేతులా ఓడింది. స్టార్టింగ్‌లో హిట్‌మ్యాన్, డికాక్ వరుస షాట్లతో ఈజీగా రన్స్ రాబట్టడంతో ఫస్ట్ 6 ఓవర్లలోనే ముంబై 56/0తో నిలిచింది. అయితే, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రాకతో ముంబై ఇన్నింగ్స్ తలకిందులైంది. తన నాలుగో బాల్‌కే డికాక్‌ను ఔట్ చేసిన చహల్ ఫస్ట్ బ్రేక్ ఇవ్వగా.. పార్ట్‌టైమర్ మ్యాక్స్‌వెల్ పదో ఓవర్లో రోహిత్‌ను వెనక్కుపంపాడు. అక్కడి నుంచి ముంబై బ్యాటింగ్ పేకమేడను తలపించింది. ఇషాన్ (9), క్రునాల్ (5), సూర్యకుమార్ (8) చేతులెత్తేశారు. చివరి ఐదు ఓవర్లలో 67 రన్స్ అవసరం అవగా పొలార్డ్ (7), హార్దిక్ (3) క్రీజులో ఉండటంతో ముంబై ఆశలు కోల్పోలేదు. కానీ, 17వ ఓవర్లో తొలి మూడు బాల్స్‌లో హార్దిక్, పొలార్డ్, రాహుల్ చహర్ (0)ను ఔట్ చేసిన హర్షల్ హ్యాట్రిక్ తీశాడు. ఆపై, చహల్ బౌలింగ్‌లో బుమ్రా (5) బౌల్డ్ అవగా... మిల్నే (0)ను బౌల్డ్ చేసిన హర్షల్ ముంబైని ఆలౌట్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 165/6 (మ్యాక్స్‌వెల్ 56, కోహ్లీ 51, బుమ్రా 3/36)
ముంబై: 18.1 ఓవర్లలో 111 ఆలౌట్ (రోహిత్ 43, హర్షల్ 4/17, చహల్ 3/11).