దంచికొట్టిన దూబే,యశస్వి..చెన్నైపై రాజస్తాన్ విక్టరీ

దంచికొట్టిన దూబే,యశస్వి..చెన్నైపై రాజస్తాన్ విక్టరీ

ఐపీఎల్‌‌ 14 సెకండ్‌‌ ఫేజ్‌‌లో తొలిసారి పరుగుల మోత మోగింది. చెన్నై, రాజస్తాన్‌‌ ప్లేయర్లు పోటాపోటీగా సిక్సర్లు, ఫోర్లు బాదేసి ఫ్యాన్స్‌‌కు ధనాధన్‌‌ లీగ్‌‌ సిసలైన మజాను  రుచి చూపించారు. సూపర్‌‌ కింగ్స్‌‌ ఓపెనర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ .. యూఏఈ లెగ్‌‌లో తొలి సెంచరీ సాధించి శభాష్‌‌ అనిపించుకుంటే... రాయల్స్‌‌ యంగ్‌‌ ఓపెనర్‌‌ యశస్వి జైస్వాల్‌‌ మెరుపు హాఫ్‌‌ సెంచరీ చేసి వరల్డ్‌‌ క్రికెట్‌‌కు తన సత్తా చూపెట్టాడు. వీరికి శివమ్‌‌ దూబే ఊచకోత తోడవ్వడంతో  ఊపు తారాస్థాయికి చేరింది.  ఓవరాల్‌‌గా బౌండ్రీల హోరు కొనసాగిన పోరులో రాయల్స్‌‌ పైచేయి సాధించింది. టేబుల్‌‌టాపర్‌‌ చెన్నైకి షాకిచ్చి ప్లే ఆఫ్స్‌‌ రేసును మరింత రసవత్తరం చేసింది.

అబుదాబి : బౌండ్రీలు చిన్నబోయిన వేళ.. ఐపీఎల్‌‌ 14 ఫేజ్‌‌–2లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ అద్భుత విజయం సాధించింది.  హ్యాట్రిక్‌‌ ఓటముల తర్వాత భారీ విక్టరీ సాధించి ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.  శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ 7 వికెట్లతో చెన్నైపై గెలిచింది. రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (60 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌‌) సెంచరీ చేయగా  టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 189 రన్స్‌‌ చేసింది. రవీంద్ర జడేజా(15 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32 నాటౌట్‌‌) ధనాధన్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు.  రాజస్తాన్‌‌ బౌలర్లలో రాహుల్‌‌ తెవాటియా(3/39) మూడు వికెట్లు తీశాడు. అనంతరం శివమ్‌‌ దూబే (42 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్‌‌), యశస్వి జైస్వాల్‌‌(21 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50)  మెరుపు హాఫ్‌‌ సెంచరీలతో చెలరేగడంతో 17.3 ఓవర్లలో 190/3 స్కోరు చేసిన రాయల్స్​ ఈజీగా గెలిచింది.  చెన్నై బౌలర్లలో శార్దూల్‌‌ ఠాకూర్‌‌(2/30) రెండు వికెట్లు తీశాడు. గైక్వాడ్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.

జైస్వాల్​, దూబే ధనాధన్​

ఛేజింగ్‌‌ను రాజస్తాన్‌‌ టాప్‌‌ గేర్‌‌లో స్టార్ట్‌‌ చేసింది. తన మూడో బాల్‌‌ను బౌండ్రీ దాటించిన యశస్వి ..హేజిల్‌‌వుడ్‌‌ వేసిన ఇన్నింగ్స్‌‌ రెండో ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టాడు. కరన్‌‌ వేసిన మూడో ఓవర్‌‌లో మరో ఓపెనర్‌‌ ఎవిన్‌‌ లూయిస్‌‌ 6,4 రాబట్టాడు. ఇక, హేజిల్‌‌వుడ్‌‌ వేసిన ఐదో ఓవర్లో  యశస్వి వరుసగా 6, 6, 4,6తో 19 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. లూయిస్‌‌ను ఔట్‌‌ చేసిన ఠాకూర్‌‌ చెన్నైకు బ్రేక్‌‌ ఇచ్చినప్పటికీ పవర్‌‌ ప్లేలో రాయల్స్‌‌ 81/1 స్కోరుతో బలమైన స్థితిలో నిలిచింది. ఆపై, ఆసిఫ్‌‌ వేసిన  ఏడో ఓవర్లో జైస్వాల్​  కూడా ఔటవ్వడంతో  చెన్నై రేసులోకి వచ్చినట్టు కనిపించింది. కానీ శాంసన్‌‌(28), దూబే ఎదురుదాడి కొనసాగించారు. అలీ వేసిన10 ఓవర్‌‌లో దూబే రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో సగం ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి రాయల్స్‌‌ 119/2పై నిలిచింది.  అదే జోరు కొనసాగించిన దూబే 31 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి30 బాల్స్‌‌లో 25 రన్స్‌‌ అవసరం కాగా.. ఠాకూర్‌‌ వేసిన 16వ ఓవర్‌‌లో భారీ షాట్‌‌కు ట్రై చేసిన శాంసన్‌‌.. గైక్వాడ్‌‌కు దొరికిపోయాడు.కానీ ఫిలిప్స్‌‌(14 నాటౌట్‌‌) అండతో ఎలాంటి డ్రామాకు తావులేకుండా  దూబే మ్యాచ్ ఫినిష్‌‌ చేశాడు. 

గైక్వాడ్‌‌ వీరబాదుడు..

చెన్నై ఇన్నింగ్స్​లో రుతురాజ్‌‌ గైక్వాడే హీరో. . నెమ్మదిగా ఆట మొదలుపెట్టిన గైక్వాడ్‌‌.. రాయల్స్‌‌ బౌలర్లకు క్రమంగా చుక్కలు చూపెట్టాడు. తాను ఫేస్‌‌ చేసిన చివరి 31 బాల్స్‌‌లో  ఏకంగా 71 రన్స్‌‌ చేశాడు. తొలి ఓవర్‌‌లో రెండు బౌండ్రీలు కొట్టి రుతురాజ్​ టచ్‌‌లోకి రాగా మరో ఓపెనర్‌‌ డుప్లెసిన్‌‌(25) ఆచితూచి ఆడాడు. దీంతో పవర్‌‌ ప్లేలో  చెన్నై 44 రన్స్‌‌ చేసింది. అయితే తెవాటియా తన వరుస ఓవర్లలో డుప్లెసిస్​తో పాటు రైనా(3)ను ఔట్​ చేసి చెన్నైకి షాకిచ్చాడు. కానీ, మొయిన్‌‌ అలీ(21)తో కలిసి జోరు కొనసాగించిన గైక్వాడ్‌‌  మూడో వికెట్‌‌కు 36 బాల్స్‌‌లో 57 రన్స్‌‌ జోడించాడు. ఈ క్రమంలో  14వ ఓవర్‌‌లో తను 43 బాల్స్​లో ఫిఫ్టీ  కంప్లీట్‌‌ చేయగా చెన్నై కూడా వంద రన్స్‌‌ మార్కు చేరింది. ఆ తర్వాత గైక్వాడ్‌‌  తన విశ్వరూపం చూపెట్టాడు. తెవాటియా వేసిన 15 ఓవర్లో  6, 6,  ఆకాశ్‌‌ బౌలింగ్​లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. అలీ , రాయుడు ఔటైనా తను ఏమాత్రం తగ్గలేదు.  18వ ఓవర్ తొలి బాల్‌‌కు గైక్వాడ్‌‌ కొట్టిన భారీ సిక్సర్‌‌(95 మీటర్లు) మ్యాచ్‌‌కే హైలైట్‌‌. ఇక,  ముస్తాఫిజుర్​ వేసిన లాస్ట్​ ఓవర్లో (​ తొలి నాలుగు బాల్స్‌‌లో 4,6, 4 సహా  16 రన్స్‌‌ రాబట్టిన జడేజా చివరి రెండు బాల్స్‌‌లో గైక్వాడ్‌‌కు స్ట్రయిక్‌‌ ఇచ్చాడు. అప్పటికి 95 రన్స్​ వద్ద ఉన్న రుతురాజ్​ ఐదో బాల్‌‌ను టచ్‌‌ చేయలేకపోయాడు. కానీ, లాస్ట్​ బాల్​ను  మిడ్‌‌వికెట్‌‌ మీదుగా భారీ సిక్సర్‌‌ కొట్టి సెంచరీ పూర్తి చేయడంతోపాటు ఇన్నింగ్స్‌‌కు అదిరిపోయే ముగింపు ఇచ్చాడు.