రాహుల్​ కమాల్.. కోల్​కతాపై పంజాబ్​ గెలుపు

రాహుల్​ కమాల్.. కోల్​కతాపై పంజాబ్​ గెలుపు

దుబాయ్‌: ఐపీఎల్‌ 14 ఫ్లే ఆఫ్‌ రేసును మరింత రసవత్తరం చేస్తూ పంజాబ్‌ కింగ్స్‌ కీలక విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ బెర్తులో నాలుగో స్థానం కోసం జరుగుతున్న రేసును ఆసక్తికరంగా మార్చింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(55 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటడంతో  శుక్రవారం జరిగిన మ్యాచ్​లో  కోల్‌కతా నైట్‌రైడర్స్​పై  పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయమవ్వగా.. పంజాబ్‌, కోల్‌కతా, ముంబై మధ్య టాప్​–4 రేస్‌ హీట్‌ పెరిగింది.  ఈ పోరులో తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో  165/7 స్కోరు చేసింది.  వెంకటేశ్‌ అయ్యర్‌(49 బాల్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67) హాఫ్‌ సెంచరీ చేయగా రాహుల్‌ త్రిపాఠి(34), నితీశ్‌ రాణా(31) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌(3/32) మూడు, రవి బిష్నోయ్‌(2/22) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో పంజాబ్​ 19.3 ఓవర్లలో  168/5 స్కోరు చేసి గెలిచింది.   ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రాహుల్‌తో పాటు  మయాంక్‌ అగర్వాల్‌(27 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) రాణించాడు. 

రాహుల్‌ సూపర్‌ షో..

ఛేజింగ్‌లో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ పంజాబ్​కు అదిరిపోయే స్టార్ట్‌ ఇచ్చారు. ఫస్ట్‌ వికెట్‌కు 70 రన్స్‌ జోడించిన ఈ జోడీ కింగ్స్‌ విక్టరీకి బలమైన పునాది వేసింది. కానీ,  తన వరుస ఓవర్లో మయాంక్‌, నికోలస్‌ పూరన్‌(12)ను ఔట్‌ చేసిన వరుణ్‌ నైట్‌ రైడర్స్‌కు డబుల్‌ బ్రేక్‌ ఇచ్చాడు.  దీంతో మార్‌క్రమ్‌(18) క్రీజులోకి రాగా అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రాహుల్‌ కూడా స్పీడు పెంచాడు. దీంతో పంజాబ్‌ 15 ఓవర్లకు 121/2పై నిలిచింది. అయితే, 16వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ను ఔట్‌ చేసిన నరైన్‌ మ్యాచ్‌లో హీట్‌ పెంచాడు. దీపక్‌ హుడా(3) కూడా ఫెయిలవ్వగా  షారుఖ్‌ ఖాన్‌(22 నాటౌట్‌)తో కలిసి రాహుల్‌ లక్ష్యాన్ని కరిగించాడు. చివరి ఐదు బాల్స్‌లో నాలుగు రన్స్‌ కావాల్సిన టైమ్‌లో రాహుల్‌ ఔటైనా.. తర్వాతి బాల్‌కే సిక్స్‌ కొట్టిన షారుఖ్‌  లాంఛనం పూర్తి చేశాడు. 

వెంకటేశ్‌, త్రిపాఠి మెరుపులు..

కీలక మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి సత్తా చాటడంతో భారీ స్కోరుపై కన్నేసిన కోల్‌కతాకు పంజాబ్‌ బౌలర్లు అర్షదీప్‌, బిష్నోయ్‌ బ్రేక్​ వేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు సరైన స్టార్ట్‌ దొరకలేదు. అర్షదీప్‌ వేసిన మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ గిల్‌(7) బౌల్డ్‌ అయ్యాడు. కానీ అయ్యర్‌తో కలిసిన త్రిపాఠి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ బౌండ్రీలతో చెలరేగడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి నైట్‌రైడర్స్‌ 49/1పై నిలిచింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన వీరిద్దరు రెండో వికెట్‌కు 72 రన్స్‌ జోడించారు. అయితే, స్వల్ప తేడాలో బిష్నోయ్‌ వీరిద్దరినీ ఔట్‌ చెయ్యడంతో నైట్‌రైడర్స్‌ స్పీడు తగ్గింది.   కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(2) ఫెయిలవ్వగా నితీశ్‌ రాణా కాసేపు మెరిపించాడు.  అర్షదీప్‌ బౌలింగ్‌లో రాణా కూడా ఔటయ్యాడు. ఆఖరి 12 బాల్స్‌లో  సీఫర్ట్‌(2),  కార్తీక్‌(11) వికెట్లు కోల్పోయిన కేకేఆర్​ 14 రన్స్‌ మాత్రమే చేసింది. 

సంక్షిప్త స్కోర్లు 

కోల్‌కతా : 20 ఓవర్లలో 165/7( వెంకటేశ్‌ 67, త్రిపాఠి 34, అర్షదీప్‌  3/32)
పంజాబ్‌ :19.3 ఓవర్లలో 168/7( రాహుల్‌ 67, మయాంక్‌  40, వరుణ్‌ 2/24).