దసరా నాడే ఐపీఎల్ ఫైనల్ ధమాకా

దసరా నాడే ఐపీఎల్ ఫైనల్ ధమాకా

ముంబై :  క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌కు ఈ ఏడాది దసరా రోజున.. డబుల్‌‌ ధమాకా సిద్ధమైంది. పండుగ సంబురాలకు తోడు ఐపీఎల్ ఫైనల్‌‌తో ఆ రోజంతా జోష్‌‌  హై రేంజ్‌‌లో ఉండనుంది. ఐపీఎల్‌‌ 14వ సీజన్‌‌లో మిగిలిన మ్యాచ్‌‌లను యూఏఈకి తరలించిన బీసీసీఐ షెడ్యూల్‌‌ను కూడా కన్ఫామ్‌‌ చేసింది. సెప్టెంబర్‌‌ 19 నుంచి అక్టోబర్‌‌ 15 వరకు యూఏఈ వేదికగా లీగ్‌‌ జరుగుతుందని బీసీసీఐ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ రాజీవ్‌‌ శుక్లా బుధవారం ప్రకటించారు. అక్టోబర్‌‌ 15 అంటే దసరా పర్వదినాన జరిగే ఫైనల్‌‌ మ్యాచ్‌‌తో ఐపీఎల్‌‌ 2021 ఎడిషన్‌‌ విజేత ఎవరో తేలనుంది.  బోర్డు ముందుగా అక్టోబర్​10లోపే లీగ్‌‌ను ముగించాలని అనుకున్నా.. యూఏఈలో వేసవి దృష్ట్యా డబుల్‌‌ హెడర్స్‌‌ (డే మ్యాచ్‌‌లు)ను తగ్గించడంతో పాటు దసరా నాడు ఫైనల్‌‌ ఉండేలా ప్లాన్​ చేసింది.కాగా,  కరోనా దెబ్బకు మే 4న లీగ్‌‌ను వాయిదా వేసే సమయానికి 29 మ్యాచ్‌‌లు జరిగాయి. ఫైనల్‌‌ సహా మిగిలిన 31 మ్యాచ్‌‌లు యూఏఈలో జరుగుతాయి.

ఐసీసీ నో అబ్జెక్షన్​!

టీ20 వరల్డ్‌‌కప్‌‌ అక్టోబర్‌‌లో నిర్వహించాల్సి ఉండటంతో లీగ్‌‌ కోసం బీసీసీఐ చేస్తున్న ప్లాన్స్‌‌కు ఐసీసీ అడ్డుచెబుతుందని అంతా భావించారు. రెండు టోర్నీలకు మధ్య టైమ్‌‌ గ్యాప్‌‌ తక్కువ ఉండటమే సమస్యని అనుకున్నారు. కానీ, ఈ విషయంలో ఇండియన్‌‌ బోర్డు, ఇంటర్నేషనల్‌‌ బాడీ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగా అక్టోబర్‌‌ 18 నుంచి టీ20 వరల్డ్‌‌కప్‌‌ స్టార్ట్‌‌ అవుతుందని ఐసీసీకి చెందిన  ఓ అధికారి   వెల్లడించారు. పూర్తి షెడ్యూల్‌‌ను జులైలో రిలీజ్‌‌ చేస్తామని తెలిపారు. ‘టీ20 వరల్డ్‌‌కప్‌‌కు సంబంధించిన వేదికలు, షెడ్యూల్‌‌ను జులైలో రిలీజ్‌‌ చేస్తాం. డొమెస్టిక్‌‌ టోర్నీకి, ఐసీసీ ఈవెంట్‌‌కు మధ్య ఉండాల్సిన గ్యాప్​పై ఎలాంటి రూల్​ లేదు. కానీ పిచ్‌‌లను, గ్రౌండ్స్‌‌ను రెడీ చేసుకునేందుకు మాకు పది రోజులు టైమ్‌‌ అవసరం. అది ఆనవాయితీగా వస్తుంది తప్ప రూల్‌‌ అయితే కాదు. మిగిలినవన్నీ బీసీసీఐ తో చర్చించాల్సి ఉంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, లీగ్‌‌ ముగిసిన మూడు రోజులకే ఐసీసీ ఈవెంట్‌‌ స్టార్ట్‌‌ అయినా ప్లేయర్లకు ఎలాంటి  ఇబ్బంది  ఉండదని రాజీవ్‌‌ శుక్లా చెబుతున్నారు. ‘ మాకున్న సమాచారం మేరకు  టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫస్ట్‌‌ ఫేజ్‌‌లో క్వాలిఫయర్‌‌ దేశాలు మాత్రమే పోటీపడతాయి. ఇండియాతోపాటు ఇతర టాప్‌‌ టీమ్‌‌లు కాస్త ఆలస్యంగా బరిలోకి దిగుతాయి. అందువల్ల ఐపీఎల్‌‌ బరిలో ఉన్న ప్లేయర్లకు కావాల్సినంత టైమ్‌‌ దొరుకుతుంది’అనిశుక్లా పేర్కొన్నాడు.