
పుణె:ఈ సీజన్ ఆరంభం నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ అందరికంటే ముందే ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గత మ్యాచ్ ల్లో బ్యాటింగ్ దుమ్మురేపిన జీటీ.. ఈసారి తమ బౌలింగ్ దమ్ము చూపెట్టింది. 145 రన్స్ టార్గెట్‌ను కాపాడుకుంటూ లక్నో సూపర్ జెయింట్స్‌ను రెండో ప్లేస్‌కు దింపింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న లక్నో చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరిచింది. మంగళవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 62 రన్స్ తేడాతో టైటాన్స్ చేతిలో చిత్తయింది. బౌలింగ్ పిప్‌పై తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 144/4 స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బాల్స్ లో 7 ఫోర్లతో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ (2/26) రెండు వికెట్లు తీశాడు. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో చేతులెత్తేసిన లక్నో 13.5 ఓవర్లలోనే 82 రన్స్‌కు ఆలౌటైంది. దీపక్ హుడా (27) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4/24) రాణించాడు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
ఆదుకున్న గిల్..
గుజరాత్ ఇన్నింగ్స్‌లో గిల్ హీరోగా నిలిచాడు. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆ టీమ్‌కు కు ఆశించిన ఆరంభం లభించలేదు. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు రావడమే కష్టంగా మారింది. తొలుత ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5)ను ఔట్ చేసిన మోసిన్ ఖాన్.. లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. రెండు ఫోర్లతో జోరు చూపించిన వేడ్ (10)ను కాసేపటికే అవేశ్ పెవిలియన్ పంపాడు. దాంతో, పవర్‌ప్లేలో జీటీ 35/2 స్కోరు మాత్రమే చేసింది. అసలే చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్ లో కాసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) వికెట్ కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. ఈ దశలో మరో ఓపెనర్ గిల్ తో పాటు మిల్లర్ (26) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నా స్కోర్ లో వేగం మాత్రం పెరగలేదు. ఇక హోల్డర్ వేసిన 16వ ఓవర్లో ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్ బాదిన మిల్లర్ జట్టు స్కోర్ ను 100 దాటించినా.. అదే ఓవర్లో ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో సింగిల్ తో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు రెండు ఫోర్లతో స్కోర్ లో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. ఇక 18, 19వ ఓవర్లలో 11 రన్స్ మాత్రమే వచ్చినా.. ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు బాదిన తెవాటియా (22 నాటౌట్) జట్టుకు కాపాడుకునే స్కోరు అందించాడు.
లక్నో పేకమేడలా..
లక్ష్యం చిన్నదే అయినా గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో లక్నో ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు. దీపక్ హుడా ఒక్కడే క్రీజులో నిలదొక్కుకోగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్ చేరేందుకు పోటీ పడ్డారు. నిర్లక్ష్యమైన షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. వరుసగా మూడు ఓవర్లు వేసిన షమీ ఐదు పరుగులే ఇవ్వగా.. నాలుగో ఓవర్లో సిక్స్ తో జోరు మీద కనిపించిన ఓపెనర్ డికాక్ (11)ను తర్వాతి బంతికే పెవిలియన్ పంపిన యశ్ దయాల్.. లక్నో వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆపై, కెప్టెన్ రాహుల్ (8), కరణ్ శర్మ (4)తో పాటు క్రునాల్ పాండ్యా (5) వికెట్లు కోల్పోయిన జెయింట్స్ సగం ఓవర్లకు 58/4తో పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. మిడిలార్డర్ బ్యాటర్లయినా ఏదైనా అద్భుతం చేస్తారనుకుంటే అదీ జరగలేదు. 11 ఓవర్లో ఆయుష్ బదోని (8) స్టంపౌట్ కాగా.. తర్వాత స్టోయినిస్ (2) రనౌట్ తో పాటు హోల్డర్ (1)ను రషీద్ ఖాన్ ఎల్బీ చేశాడు. కాసేపటికే మోసిన్ (1)ను కొత్త బౌలర్ సాయి కిశోర్ పెవిలియన్ చేర్చగా... హుడాతో పాటు రెండు సిక్సర్లు కొట్టిన అవేశ్ (12) వికెట్ తీసిన రషీద్ లక్నోను ఆలౌట్ చేశాడు.