హోరాహోరీ పోరులో ముంబై ఓటమి.. ఫైనల్‌ చేరిన గుజరాత్

హోరాహోరీ పోరులో ముంబై ఓటమి.. ఫైనల్‌ చేరిన గుజరాత్

హోరాహోరీగా సాగిన క్వాలిఫైయ‌ర్ -2 పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఈ మ్యాచులో 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేశారు. యువ బ్యాటర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ(129)తో మెరవగా, సాయి సుదర్శన్(43), హార్దిక్ పాండ్యా(28) పరుగులతో రాణించారు. అనంతరం 234 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ(61) చేయగా, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. 

ఇక ఎప్పటిలానే రోహిత్ శర్మ(8) త్వరగా పెవిలియన్ చేరగా, కామెరూన్ గ్రీన్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. సూర్య- కామెరూన్ గ్రీన్ జోడి  నాలుగో వికెట్‌కు 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పినా.. భారీ లక్ష్యం కావడంతో ముంబై ఓటమి తప్పలేదు.  గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 వికెట్లు తీసుకోగా.. షమీ 2, రషీద్ ఖాన్ 2, జాషువా లిటిల్ 1 పడగొట్టారు. మే 28న ఇదే వేదికపై ఐపీఎల్ 2023 ఫైనల్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ లో ఓడిన గుజరాత్, చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? అన్నది తెలియాలి.