IPL 2024 auction: 16 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలి మ‌హిళా ఆక్ష‌నీర్.. ఎవరీ మ‌ల్లికా సాగ‌ర్?

IPL 2024 auction: 16 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలి మ‌హిళా ఆక్ష‌నీర్.. ఎవరీ మ‌ల్లికా సాగ‌ర్?

ఐపీఎల్‌ 2024 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1:00 గంట నుంచి వేలం ప్రక్రియ షురూ కానుంది. ఈ వేలం ద్వారా 77 బెర్త్ లు భర్తీ చేయనుండగా, భారత్ సహా 12 దేశాలకు చెందిన 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మహిళ వేలం ప్రక్రియను ముందుండి నడిపించనున్నారు. ఆమె ఎవ‌రో కాదు.. మ‌ల్లికా సాగ‌ర్.

ఐపీఎల్ టోర్నీ ప్రస్థానం ప్రారంభమైన 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాడ్లీ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 నుంచి గతేడాది వరకు హ్యూ ఎడ్మిడ్స్ ఆక్షన్‌ను నడిపించారు. అయితే గతేడాది వేలం మధ్యలో అతను అనారోగ్యానికి గురవ్వడంతో చారు శర్మ ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఈ ఏడాది మల్లికా సాగర్ ఐపీఎల్ వేలం ప్రక్రియను నడిపించనున్నారు. దీంతో ఎవరీమె అని నెటిజన్లు శోధిస్తున్నారు. ఈ తరుణంలో ఆమె గురుంచి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

ఎవరీ మ‌ల్లికా సాగ‌ర్..?

మల్లికా సాగర్‌(43) స్వస్థలం ముంబై. వ్యాపార నేప‌థ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన మ‌ల్లిక కు ఆర్ట్ క‌లెక్ష‌న్ అంటే ఇష్టం. అమెరికాలో హిస్ట‌రీ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన ఆమె, స్వ‌దేశానికి తిరిగొచ్చాక ముంబైలోని ఒక ప్రైవేట్ ఆక్ష‌న్ సంస్థ‌లో ఆర్ట్ కలెక్టర్‌గా పనిచేసేవారు. ఆర్ట్ వేలం నిర్వాహకురాలిగా ఆమెకు 25 ఏళ్ల అనుభవం ఉంది. 2021 నుంచి ప్రొ.కబడ్డీ లీగ్‌కు మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే, ఆమె గతేడాది ఫిబ్రవరిలో జరిగిన మహిళా ఐపీఎల్ ఆక్షనీర్‌గానూ పనిచేసింది. దీంతో ఆమె పేరు ఒక్క‌సారిగా మార్మోగిపోయింది. అందువల్లే ఆమెకు బీసీసీఐకి కీలక బాధ్యతలు అప్పగించింది.