IPL 2024: అభిమానులకు బిగ్ ట్విస్ట్.. చెన్నై జట్టులోకి టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్

IPL 2024: అభిమానులకు బిగ్ ట్విస్ట్.. చెన్నై జట్టులోకి టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్

భారత వెటరన్ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను సీఎస్‌కే జట్టులో భాగస్వామ్యం కాబోతున్నానని బాంబు పేల్చి ఆ జట్టు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆదివారం (ఏప్రిల్ 14) వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌.. ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా.. ఈ సమయంలో పుజారా సోషల్ మీడియాలో ఒక రహస్య పోస్ట్ చేశారు.

"#SupperKings ఈ సీజన్‌లో మీతో చేరడానికి ఎదురు చూస్తున్నారు.. " అని పుజారా ఆదివారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే, జట్టులో తన పాత్ర ఏంటనేది పుజారా తెలియపరచలేదు. ఇదే చెన్నై అభిమానులను జట్టు పీక్కొనేలా చేస్తోంది. పుజారా అనుభవజ్ఞుడైన ఆటగాడు అయినప్పటికీ.. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ప్రసిద్ధి. అలాంటి మన పుజారా ఎక్కడ ఆ జట్టులో బ్యాటర్ గా చేరతాడో అని వారు ఆశ్చర్యపోతున్నారు. గాయం కారణంగా చెన్నై జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే దూరమయ్యారు. అతని స్థానంలో పుజారా వస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

పుజారా రాక సాధ్యమేనా..!

వాస్తవానికి చటేశ్వర్ పుజారా సూపర్ కింగ్స్ జట్టులో భాగం కాలేడు. అందుకు ప్రధాన కారణం.. అతను వేలంలో పాల్గొనలేదు. వేలానికి తన పేరు నమోదు చేసుకోలేదు. ఈ కారణంగా అతన్ని ఏ ఆటగాడికి ప్రత్యామ్నాయంగా తీసుకోలేరు. కెరీర్ మొత్తంలో 30 ఐపిఎల్‌ మ్యాచ్‌లు ఆడిన పుజారా 99.74 స్ట్రైక్ రేట్ తో 390 పరుగులు చేశాడు.