IPL 2024: ఆడిందే 3 బాల్స్.. ఆల్ టైమ్ రికార్డు.. ఐపిఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని

IPL 2024: ఆడిందే 3 బాల్స్.. ఆల్ టైమ్ రికార్డు.. ఐపిఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని

సోమవారం(ఏప్రిల్ 8) కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. విజయానికి చివరి 19 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని కాసేపు అభిమానులను ఆనందపరిచాడు. విన్నింగ్ షాట్ కొట్టకుండా.. ఆచి తూచి ఆడుతూ అభిమానులను సంతోషపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని నాటౌట్ గా నిలిచాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపిఎల్‌లో ఓ ఆల్‌టైమ్ రికార్డుకు చేరువ చేసింది. 

అభిమానుల సంతోషం కోసమే..!  

నిజానికి ధోని క్రీజులోకి వచ్చే సమయానికే చెన్నై విజయానికి చేరువ కావడంతో అతనికి ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. విజయానికి 3 పరుగుల దూరంలో శివమ్ దూబే(28) ఔట్ అవ్వడంతో.. అభిమానుల సంతోషం కోసం క్రీజులోకి వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయాల్లో అత్యధిక సార్లు(28) నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్‌గా ధోని ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు రవీంద్ర జడేజా(27 సార్లు) పేరిట ఉండేది. ఆ రికార్డును ధోని అధిగమించాడు. 

విజయవంతమైన ఛేజ్‌లలో ఎక్కువ సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు

  • ఎంఎస్ ధోని: 28
  • రవీంద్ర జడేజా: 27
  • దినేష్ కార్తీక్: 23
  • యూసుఫ్ పఠాన్: 22
  • డేవిడ్ మిల్లర్: 22

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు చేయగా.. చెన్నై బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముగించారు.