IPL 2024 : నాలుగు జట్లకు కొత్త కెప్టెన్లు

IPL  2024  :   నాలుగు జట్లకు కొత్త కెప్టెన్లు

ఐపీఎల్ కొత్త సీజన్‌‌కు రంగం సిద్ధమైంది. కొత్త కెప్టెన్లతో,  కొన్ని కొత్త రూల్స్‌‌తో అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. శుక్రవారం చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌‌తో మెగా లీగ్ 17వ సీజన్‌కు తెరలేవనుంది. గత ఎడిషన్ మాదిరిగానే ఈసారి కూడా పది జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో టీమ్ 14 మ్యాచ్‌‌లు ఆడనుంది. లీగ్‌‌లో మొత్తం 74 మ్యాచ్‌‌లు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి తొలి 17 రోజుల్లో  జరిగే 21 మ్యాచ్‌‌ల షెడ్యూల్‌‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది. ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఈ సీజన్‌‌ మొత్తాన్ని దేశంలోనే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.  

ఈ సీజన్‌‌లో నాలుగు జట్లు తమ నాయకత్వాన్ని మార్చుకున్నాయి. ఇందులో రెండు అనూహ్య మార్పులు. గత పదేండ్లలో  జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్‌‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌‌ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌‌గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇందుకోసం పాండ్యాను ట్రేడింగ్‌‌లో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ నుంచి తీసుకుంది. అయితే, ఈ కెప్టెన్సీ మార్పు విమర్శలకు తావిచ్చింది. ఈ మార్పు ముంబైకి మంచి చేస్తుందా? చేటు చేస్తుందా? అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.మరోవైపు అనూహ్య నిర్ణయాలకు మారుపేరైన లెజెండరీ క్రికెటర్ ధోనీ ఈ సీజన్‌‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు కెప్టెన్‌‌గా తప్పుకొని యంగ్‌‌స్టర్‌‌‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌కు పగ్గాలు ఇచ్చాడు. ఏజ్‌‌ దృష్ట్యా 42 ఏండ్ల ధోనీకి ఇదే చివరి సీజన్‌‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

అయితే, 2022లో జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం  బెడిసికొట్టింది. కెప్టెన్సీ ఒత్తిడిలో  ఆటగాడిగానూ నిరాశపరిచిన జడేజా మధ్యలోనే పగ్గాలు వదిలేశాడు. దాంతో, మళ్లీ ధోనీనే పగ్గాలు చేపట్టాడు. మరి, డిఫెండింగ్ చాంప్ సీఎస్కేను  రుతురాజ్‌‌ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. ఇక, పాండ్యాను ముంబైకి ట్రేడ్‌‌ చేసిన గుజరాత్ టైటాన్స్‌‌ యంగ్‌‌స్టర్‌‌‌‌ శుభ్‌‌మన్ గిల్‌‌కు కెప్టెన్సీ అప్పగించింది. 24 ఏండ్ల గిల్‌‌కు కెప్టెన్సీ అనుభవం లేదు. సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరోసారి తమ కెప్టెన్‌‌, కోచింగ్ స్టాఫ్‌‌ను మార్చింది. మార్‌‌‌‌క్రమ్‌‌ ప్లేస్‌‌లో ఆసీస్‌‌ వరల్డ్ కప్‌‌ విన్నర్‌‌‌‌ పాట్ కమిన్స్‌‌కు కెప్టెన్సీ ఇచ్చిన రైజర్స్‌‌ అతనిపై కోటి ఆశలు పెట్టుకుంది. మూడేండ్లుగా చివరి స్థానం కోసం పోటీ పడుతున్న రైజర్స్‌‌ను కమిన్స్‌‌ ఎంత దూరం తీసుకెళ్తాడో చూడాలి.