IPL 2024: ధోనీకిదే చివరి ఐపీఎల్.. గైక్వాడ్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదేనా

IPL 2024: ధోనీకిదే చివరి ఐపీఎల్.. గైక్వాడ్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదేనా

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై జట్టుకు ఇంత క్రేజ్ రావడానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు భారత జట్టుకు ఐసీసీ టైటిల్స్ అందిస్తూనే.. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై జట్టుకు విజయవంతంగా నడిపాడు. కొన్ని జట్లు ఒక టైటిల్ గెలవడానికే ఇబ్బంది పడుతుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఏకంగా 5 ట్రోఫీలు గెలుచుకుంది.  

మహేంద్రుడి మాయతో ఒక్కసారిగా చెన్నై అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై అన్నట్లుగా మారిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ మాట వినడం కష్టంగానే కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ధోనీ అనుబంధం త్వరలోనే ముగియడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అయినా ఆశ్చర్యపోవనవరసం లేదు. 2023 లోనే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్ ఆడుతున్నాడనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ధోనీతో సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఉన్న కొన్ని ఒప్పందాల వలన ప్రస్తుత సీజన్ కూడా ఆడాల్సి వచ్చింది. 

ALSO READ :- మల్కాజ్ గిరి ఎన్నిక అభ్యర్థిది కాదు.. ముఖ్యమంత్రిది: రేవంత్ రెడ్డి

2023లో టైటిల్ గెలిచిన తర్వాత ధోనీ మోకాలి గాయం బారిన పడ్డాడు. సర్జరీ తర్వాత ఐపీఎల్ ఆడుతున్నానని ప్రకటించగానే ఫ్యాన్స్ ఆనందంతో పండగ చేసుకున్నారు. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని అందరికీ షాక్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. ఒకేసారి తాను తప్పుకుంటే చెన్నై జట్టు కష్టాల్లో పడడం గ్యారంటీ. అందుకే తాను ఉండగానే గైక్వాడ్ కు కొంత అనుభవాన్ని నేర్పాలని ధోనీ భావించి ఉండవచ్చు. గతంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా అతను విఫలమయ్యాడు. దీంతో ధోనీ తర్వాత చెన్నై జట్టును నడిపించే సారధిగా గైక్వాడ్ మీద నమ్మకముంచారు.

గైక్వాడ్ ఇప్పటికే కెప్టెన్సీలో తనను తాను నిరూపించుకున్నాడు. ఆసియా గేమ్స్ లో భాగంగా టీమిండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. ఈ కారణంగానే గైక్వాడ్ ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ సీజన్ లో గైక్వాడ్ కెప్టెన్ గా రాణిస్తే ధోనీ ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు  భవిష్యత్తులో టీమిండియా పగ్గాలు అందుకునే అవకాశముంది.   

ప్రస్తుతం 42 ఏళ్ళ ధోనీ పూర్తి ఫిట్ గా ఉన్నా.. మానసికంగా అలసిపోవడం.. కీపింగ్ బాధ్యతలు మహేంద్రుడికు పని భారాన్ని పెంచనున్నాయి. దీంతో మాహీ మరో ఐపీఎల్ సీజన్ ఆడటం అసాధ్యంగానే కనిపిస్తుంది. మరి ఎప్పుడూ ఊహించని నిర్ణయాలతో షాక్ ఇచ్చే ధోనీ.. మరి తన ఐపీఎల్ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

2008 లో తొలిసారి రూ. 6 కోట్ల రూపాయలకు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. తొలి ప్రయత్నంలో ఫైనల్ కు తీసుకెళ్లినా ట్రోఫీ అందించలేకపోయాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై 2010, 2011,2018,2021,2023 లో టైటిల్ గెలిచింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు ధోనీ 250 ఐపీఎల్ మ్యాచ్ లాడాడు. 38.79 యావరేజ్ తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.