IPL 2024 Auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం.. బరిలో 1,166 మంది క్రికెటర్లు

IPL 2024 Auction: డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం.. బరిలో 1,166 మంది క్రికెటర్లు

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 మినీ వేలానికి కౌంట్‌డౌన్ మొదలైంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకో కోలా అరేనా వేదికగా ఐపీఎల్ 17వ ఎడిషన్ మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో కోట్లు కొల్లగొట్టేందుకు భారత దేశవాళీ క్రికెటర్లు సహా ప్రపంచవ్యాప్తంగా 1,166 మంది క్రికెటర్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా.. మిగిలిన 336 మంది విదేశీ ప్లేయర్లు. 

ఈ జాబితాలో కేవలం 202 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారు. మిగిలిన వారు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న 1,166 మందిని వేలంలోకి ఆహ్వానించరు. ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చిన వారితో బీసీసీఐ మొదట షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ షార్ట్ లిస్ట్‌లో పేరున్న ఆటగాళ్లను మాత్రమే వేలం వేస్తారు. ఈసారి వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిపి 77 మందిని కొనుగోలు చేయనున్నాయి. ఇందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు చాలా మందే ఈసారి వేలంలో వచ్చారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్‌తో పాటు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ సహా భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్ సైతం ఈ జాబితాలో ఉన్నారు. భారత వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్ తన కనీస ధర రూ.2 కోట్లుగా రిజిస్టర్ చేసుకోగా.. వన్డే ప్రపంచ కప్‌లో సత్తా చాటిన కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు.

రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్లు: హ‌ర్ష‌ల్ ప‌టేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాద‌వ్, కేదార్ జాద‌వ్, హ్యారీ బ్రూక్, టామ్ బాంట‌న్, బెన్ డ‌కెట్, జేమీ ఓవ‌ర్ట‌న్, ఆదిల్ ర‌షీద్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, ప్యాట్ క‌మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, సియాన్ అబాట్, రీలే ర‌స్సో, ర‌సీ వాండ‌ర్ డ‌స్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఏంజెలో మాథ్యూస్.

సామ్ క‌ర‌న్ 

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్  అత్యధిక ధ‌ర ప‌లికిన ఆటగాడిగా ఉన్నాడు. గతేడాది కొచ్చి వేదికగా జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అత‌ని కోసం ఏకంగా రూ.18.50 కోట్లు వెచ్చించింది. కానీ, అతడు ఆ ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఈసారి ఆ రికార్డు బద్ధలవుతుందో.. లేదో.. చూడాలి.