
- ఇయ్యాల, రేపు భవన్స్ క్రికెట్ గ్రౌండ్‌లో లైవ్ స్క్రీనింగ్
హైదరాబాద్, వెలుగు: ఇండియా–పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పుల తర్వాత హైదరాబాద్ ఓ లీగ్ మ్యాచ్, రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోల్పోనందుకు నిరాశలో ఉన్న అభిమానులకు బీసీసీఐ కాస్త ఊరట కలిచింది. హైదరాబాద్‌కు రెండు రోజుల పాటు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌ను కేటాయించింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యా భవన్ క్యాంపస్‌లోని భవన్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ పార్క్‌లో శని, ఆదివారాల్లో జరిగే మ్యాచ్‌లను పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌పై చూడొచ్చు.
శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు సాయంత్రం 6.30 నుంచి అభిమానులను ఉచితంగా అనుమతిస్తారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్–చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్– కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లకు మధ్యాహ్నం 2.30 నుంచి ఎంట్రీ ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ పార్క్‌లో మ్యాచ్‌ల లైవ్ స్ర్కీనింగ్‌తో పాటు మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, కిడ్స్ జోన్, వర్చువల్ బ్యాటింగ్ సిమ్యులేటర్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. స్టేడియంలో లైమ్ మ్యాచ్‌ను చూసిన అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు ఉంటాయి.