డిసెంబర్ 23 నుంచి ఐపీఎల్ మినీ వేలం

డిసెంబర్ 23 నుంచి ఐపీఎల్ మినీ వేలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలం వేదిక ఖరారైంది. వచ్చే ఏడాది నిర్వహించబోయే ఐపీఎల్ సీజన్‌ కోసం వేలంపాట వేదికతో పాటు..తేదీని బీసీసీఐ- నిర్ధారించింది. కేరళలోని కొచ్చిలో ఐపీఎల్ 2023 మినీవేలాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేలాన్ని డిసెంబర్ 23న నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై  అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

లక్నో దగ్గర డబ్బుల్లేవు..
ఐపీఎల్‌లోని 10 జట్ల దగ్గర 90 నుంచి 95 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంలోనే  ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్- రూ.3.45 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్- రూ.2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్- రూ.95 లక్షలు, గుజరాత్ టైటాన్స్  రూ. 15 లక్షలు, ముంబై ఇండియన్స్ రూ.10 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 లక్షలు, ఢిల్లీ కాపిటల్స్ రూ. 10 లక్షల బ్యాలెన్స్ ఉంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్  దగ్గర మాత్రం డబ్బుల్లేవు. అయితే మినీ వేలంలో ప్రతి ప్రాంచైజీ తమ వద్ద గల బ్యాలెన్స్ కంటే..అదనంగా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.

SRH,CSK  జట్లలోని కొందరు ప్లేయర్లు ఔట్
మరోవైపు ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొందరు ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. స్థానికి తగ్గ ప్రదర్శన ఇవ్వని ప్లేయర్లకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.  రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయాస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని సమాచారం. అటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొందరు ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్ లను  విడుదల చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

గతేడాది కరోనా కారణంగా కొన్ని వేదికల్లోనే ఐపీఎల్ ను నిర్వహించిన బీసీసీఐ..ఈ సారి మాత్రం ఎప్పటిలాగే హోమ్, అవే పద్దతిలో ఐపీఎల్ జరగనుంది. మొత్తం 10 నగరాల్లో ఐపీఎల్ 2023 మ్యాచులు జరగనున్నాయి.