జులైలో IPO ల సందడి.. రూ.20 వేల కోట్లు సేకరించనున్న కంపెనీలు..

జులైలో IPO ల సందడి.. రూ.20 వేల కోట్లు సేకరించనున్న కంపెనీలు..

ముంబై: దలాల్ ​స్ట్రీట్​లో ఈనెల కూడా ఐపీఓల సందడి కనిపించనుంది. భారతీయ కంపెనీలు జులైలో ఇనీషియల్​పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) ద్వారా సుమారు 2.4 బిలియన్​డాలర్లను (దాదాపు రూ.20,040 కోట్లు) సేకరించవచ్చని ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్​-చైనా వాణిజ్య​ యుద్ధం,  భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఐపీఓలు తగ్గాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కంపెనీలు ఐపీఓల బాటపడుతున్నాయి. గత నెల కూడా కంపెనీలు ఐపీఓల ద్వారా రెండు బిలియన్​డాలర్లను సమీకరించాయి.  

హెచ్​డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక్కటే ఐపీఓతో రూ.12,500 కోట్ల వరకు సేకరించింది. అయితే సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్  భారతీయ యూనిట్, ఇతర కంపెనీలు తమ పబ్లిక్​ఇష్యూలను వాయిదా వేశాయి. ప్రస్తుతం నిఫ్టీ 50, సెన్సెక్స్ పుంజుకుంటున్నాయి. తమ గరిష్ట స్థాయిల నుంచి సుమారు 3 శాతం మాత్రమే తక్కువలో ట్రేడవుతుండటంతో పరిస్థితులు తిరిగి గాడిలో పడుతున్నాయి. యాక్సిస్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సూరజ్ కృష్ణస్వామి మాట్లాడుతూ, ఐపీఓ మార్కెట్ బూమ్​ తిరిగి మొదలయిందని, ప్రతికూలతలు లేకపోవడం మార్కెట్‌‌ను నడిపిస్తోందని అన్నారు.

జులైలో ప్రధాన ఐపీఓలు

ఎడ్యుకేషన్ ​లోన్లు ఇచ్చే  క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాదాపు రూ.5,003.5 కోట్లును సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ నెలలో అతిపెద్ద ఐపీఓ ఇదే అయ్యే అవకాశం ఉంది.  భారతదేశపు అతిపెద్ద స్టాక్ డిపాజిటరీ అయిన  నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్​ఎస్​డీఎల్​) రూ.3,340 కోట్లను సమీకరించాలని చూస్తోంది. 

ఎన్​ఎస్​డీఎల్ ​సెప్టెంబర్​లోనే లిస్టింగ్ కోసం సెబీ ఆమోదం పొందింది. అయితే మార్కెట్ సెంటిమెంట్ అప్పటి నుంచి మందగించింది.  ఆదిత్య ఇన్ఫోటెక్ (సర్వైలెన్స్ సంస్థ), ఇంజనీరింగ్,  పవర్ ట్రాన్స్​మిషన్​ -వస్తువుల తయారీదారు ఎమ్​ అండ్​ బీ కూడా ఐపీఓలకు రెడీ అవుతున్నాయి. ఇవి ప్రస్తుతం రోడ్‌‌షోలను నిర్వహిస్తున్నాయి. ఐపీఓల సమయం, ఇతర వివరాలను ఇంకా బయటపెట్టలేదు. ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఐపీఓ మార్కెట్‌‌గా 5.86 బిలియన్​ డాలర్లను సేకరించింది. 

ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం రాబడిలో 12 శాతంగా ఉంది. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, 26 బిలియన్​డాలర్ల విలువైన 143 భారతీయ ఐపీఓలు రాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే 77 ఇష్యూలకు సెబీ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈక్విరస్ ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ భావేష్ షా మాట్లాడుతూ, రాబోయే నెలలు భారతీయ ఐపీఓ మార్కెట్‌‌కు ఉత్తమమని అన్నారు. 

ఐపీఓకు హీరో మోటార్స్​రెడీ

ఆటో విడిభాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్ ఐపీఓ ద్వారా రూ.1,200 కోట్లను సేకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ఇందులో రూ.800 కోట్ల విలువైన ఫ్రెష్​ఇష్యూ, రూ.400 కోట్ల విలువైన షేర్ల ఆఫర్- ఫర్ -సేల్ (ఓఎఫ్​ఎస్​) ఉంటాయి. ఓఎఫ్​ఎస్​లో భాగంగా, ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.390 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తుంది. 

భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌‌మెంట్స్,  హీరో సైకిల్స్ ఒక్కొక్కటి రూ.ఐదు కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నాయి. తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.285 కోట్ల వరకు వచ్చే ఆదాయాన్ని అప్పుల చెల్లింపుకు ఉపయోగిస్తారు.ఉత్తరప్రదేశ్‌‌  గౌతమ్ బుద్ధ నగర్‌‌లోని కంపెనీ ప్లాంట్‌‌లో సామర్థ్య విస్తరణ కోసం పరికరాల కొనుగోలుకు, ఇతర అవసరాలకు కొంత డబ్బు కేటాయిస్తారు.