
చండీగఢ్: హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ వై. పూరన్‌కుమార్ సూసైడ్ కేసులో డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను, రోహ్తక్ మాజీ ఎస్పీ నరేంద్ర బైజర్నియాను అరెస్ట్ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అప్పటివరకూ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. నిందితులపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని దళిత మహాపంచాయత్ నేతలు కూడా అల్టిమేటం జారీ చేశారు.
రాష్ట్ర డీజీపీ, ఎస్పీ నరేంద్రతోపాటు పలువురు ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఈ నెల 7న లేఖ రాసి సూసైడ్ చేసుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేవరకూ పూరన్‌కుమార్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించబోమని ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అమ్నీత్ పి. కుమార్ తేల్చిచెప్పారు.
దీంతో ఆరు రోజులుగా పూరన్ కుమార్ డెడ్ బాడీ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి మార్చురీలోనే ఉంది. దళితుడు అయినందుకే తన భర్తపై వేధింపులకు పాల్పడ్డారని, కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని తేలికపాటి సెక్షన్లను నమోదు చేశారని అమ్నీత్ కుమార్ ఆరోపించారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లోని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేయడంతో ఆదివారం ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లో సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)ను చేర్చారు. మరోవైపు ఐపీఎస్ పూరన్‌కుమార్ సూసైడ్ కేసుపై దళిత సంఘాలకు చెందిన 31 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీ ఆదివారం చండీగఢ్‌లో ‘దళిత మహాపంచాయత్’ సమావేశం నిర్వహించింది. డీజీపీ కపూర్, మాజీ ఎస్పీ నరేంద్రను అరెస్ట్ చేయాలని, ఇతర డిమాండ్లకూ అంగీకరించకపోతే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేసింది.
పూరన్‌కు భట్టి, డీజీపీ నివాళి
చండీగఢ్‌కు డిప్యూటీ సీఎం భట్టితో పాటు డీజీపీ సహా 8 మంది సీనియర్ఐపీఎస్అధికారులు వెళ్లారు. కుల వివక్ష, అవమానాలు భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతదేహానికి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ బర్కత్ పురకు చెందిన పూరన్ కుమార్ ఆత్మహత్య దేశవాసులను దిగ్ర్భాంతికి గురి చేసింది.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశంలోని అత్యున్నత సర్వీసులో ఉన్నవారికి కూడా సామాజిక న్యాయం అందడం లేదన్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అనడానికి పూరన్ కుమార్ ఆత్మహత్య ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.