
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్ పోలీసు అకాడమీకి రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 70వ బ్యాచ్ లో 12 మంది మహిళా ప్రోబిషనరీలుగా శిక్షణ పూర్తి చేసుకోవడం దేశానికి గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 70వ బ్యాచ్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ ఇవాళ ఉదయం ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఐపీఎస్ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. Ips శిక్షణ పూర్తి కాగానే లక్ష్యం పూర్తి అయినట్టు కాదని.. నిజాయతీగా సేవ చేసి, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ మంచి పలితాలు సాధించాలని సూచించారు. మోడీ స్మార్ట్ పోలీస్ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదన్న అమిత్ షా.. పోలీస్ సేవలు ఎక్కడ ఉంటే అక్కడ సర్ధార్ పటేల్ ఉంటారన్నారు.
రాజకీయ నాయకులకు కేవలం 5 ఏళ్లు మాత్రమే దేశానికి సేవ చేసే అవకాశముంటుందన్నఅమిత్ షా… పోలీసులకు 60 ఏళ్ల వరకు అవకాశం ఉందన్నారు.