- అమెరికా బ్లేమ్‌గేమ్ ఆడుతోంది.. మితిమీరిన డిమాండ్లు పెడుతోంది
- మా నౌకపై దాడి చేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది
- యుద్ధ నేరాలకు పాల్పడుతూ.. ‘దౌత్యం’ అంటూ నటన చేస్తున్నదని ఫైర్
- మేం చెప్పేదాకా కదలొద్దు.. హార్మూజ్‌లో నిలిచిపోయిన
- మన 14 నౌకలకు ఇండియన్ నేవీ సూచన
టెహ్రాన్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికాతో రెండో దశ చర్చలే లేవని తేల్చి చెప్పింది. పశ్చిమాసియాలో అమలవుతున్న కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చర్చల బృందాన్ని పాకిస్తాన్‌కు పంపాలని ఆదేశించిన కొద్దిసేపటికే ఇరాన్ సోమవారం సంచలన ప్రకటన విడుదల చేసింది. రెండో రౌండ్ చర్చల్లో పాల్గొనే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది.
‘‘ఇస్లామాబాద్‌లో రెండో రౌండ్ చర్చలు జరగనున్నాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ ‘ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ’ (ఐఆర్‌ఎన్‌ఏ) వెల్లడించింది. ‘‘అమెరికా మితిమీరిన డిమాండ్లు, అహేతుకమైన, అవాస్తవిక అంచనాలు, మాటిమాటికీ మారుతున్న వైఖరి, విభిన్న ప్రకటనలు చర్చలకు అడ్డంకిగా మారాయి. వీటికి తోడు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా చేపట్టిన హార్మూజ్ బ్లాకేడ్, బెదిరింపు ధోరణి వల్ల చర్చల్లో పురోగతి లేకుండా పోయింది” అని పేర్కొన్నది.
మాపై ఒత్తిడి పెంచుతోంది..
చర్చలపై అబద్ధాలు ప్రచారం చేస్తూ, తమపై ఒత్తిడి పెంచడానికి అమెరికా బ్లేమ్ గేమ్ ఆడుతోందని ఇరాన్ మండిపడింది. ఈ పరిస్థితుల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఇరాన్ నౌకపై దాడి చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమిరి మొగదమ్ ఫైర్ అయ్యారు.
‘‘ఒకవైపు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, దిగ్బంధాన్ని కొనసాగిస్తూ, యుద్ధ నేరాలకు పాల్పడుతామని బెదిరిస్తూ.. మరోవైపు దౌత్యం చేస్తున్నామని నటించడం ఇకపై కుదరదు. నౌకాదళ దిగ్బంధం కొనసాగినంత కాలం ఉద్రిక్తతలు తగ్గవు” అని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికా మొదటినుంచీ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని, ఈ విషయాన్ని మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌కు కూడా తెలియజేశామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ చెప్పారు.
‘‘నౌకాదళ దిగ్బంధం విధించడం ద్వారా అమెరికా ఒప్పందాన్ని కాలరాసింది. గతంలో చర్చలు జరుగుతున్న సమయంలోనూ మాపై దాడులు చేసిన విషయాన్ని మర్చిపోలేం. మా జాతీయ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తాం. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ కొత్త దాడులకు దిగితే మా సాయుధ దళాలు తగిన రీతిలో బదులిస్తాయి”అని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతానికి అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యం అవసరమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభిప్రాయపడ్డారు. ‘‘యుద్ధం ఎవరికీ ప్రయోజనం చేకూర్చదు. ఉద్రిక్తతలు తగ్గించడానికి అన్ని రకాల హేతుబద్ధమైన, దౌత్య మార్గాలను ఉపయోగించాలి” అని పేర్కొన్నారు.
అసలు వివాదం ఏమిటి..?
ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు, హార్మూజ్ దిగ్బంధం ప్రధాన వివాదంగా మారింది. ఇటీవల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక ఇరాన్ నౌకపై అమెరికన్ డిస్ట్రాయర్ కాల్పులు జరిపి దానిని స్వాధీనం చేసుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా విధిస్తున్న ఈ దిగ్బంధాన్ని ఎత్తివేయడమే చర్చలకు మొదటి షరతు అని ఇరాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా–-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడితో మొదలైన ఈ యుద్ధం, రెండు వారాల క్రితం తాత్కాలిక కాల్పుల విరమణతో ఆగింది. ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.
మరోవైపు, ఇరాన్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయినప్పటికీ శాంతి ఒప్పందం కుదురుతుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ‘‘మేం చాలా న్యాయమైన, సరైన డీల్‌ను ఆఫర్ చేస్తున్నాం. వారు దానిని అంగీకరిస్తారని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, ఒకవేళ డీల్ కుదరకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని తిరిగి హెచ్చరించారు.

