V6 News

హార్మూజ్ మళ్లీ క్లోజ్.. ఏ దేశానికీ మినహాయింపు లేదన్న ఇరాన్

హార్మూజ్ మళ్లీ క్లోజ్.. ఏ దేశానికీ మినహాయింపు లేదన్న ఇరాన్
  • జలసంధిని తెరిచిన 24 గంటల్లోనే యూటర్న్
  • సీజ్​ఫైర్​ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపణ
  • నౌకల రాకపోకలపై గందరగోళం
  • ఇండియన్ షిప్ సహా మరో నౌకపై కాల్పులు
  • భారత్​కు వస్తున్న 13 నౌకలను అడ్డుకున్న ఐఆర్​జీసీ

టెహ్రాన్/ వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి మళ్లీ మూతపడింది. జలసంధిని తెరిచామంటూ ప్రకటించిన 24 గంటల్లోనే ఇరాన్​ యూటర్న్ తీసుకుని హార్మూజ్​ను మళ్లీ క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. ఈసారి ఏ దేశానికీ మినహాయింపు ఉండదని, ఏ నౌకనూ వదలబోమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) తేల్చిచెప్పింది. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తున్న రెండు మర్చెంట్ నేవీ షిప్​లపై ఐఆర్​జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపాయి.

ఈ పరిణామాలతో హార్మూజ్ వద్ద మరోమారు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ దేశాలను మళ్లీ యుద్ధ భయం వెంటాడుతోంది. నౌకల రాకపోకలపై తీవ్ర గందరగోళం నెలకొంది. లెబనాన్​లో సీజ్ ఫైర్ ఒప్పందం అమలులో ఉన్నంతకాలం హార్మూజ్ తెరిచే ఉంటుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే, 24 గంటలు కూడా గడవకముందే ఇరాన్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. శనివారం జలసంధిని తిరిగి తన సైనిక నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ టెన్షన్లకు కారణం హార్మూజ్ వద్ద  అమెరికా చేపట్టిన ‘బ్లాకేడ్’ అని, జలసంధిని తాము తెరిచినా అమెరికా బ్లాకేడ్ తొలగించకపోవడంతో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడుతోంది. దీంతోపాటు ఇరాన్ ఓడరేవుల నుంచి ఎగుమతి, దిగుమతులు జరగకుండా ట్రంప్ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇరాన్ తన పంథా మార్చుకుని పూర్తిస్థాయి ఒప్పందానికి వచ్చే వరకు ఈ దిగ్బంధనాన్ని ఎత్తేసే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

భారత నౌకలపైనా కాల్పులు
శనివారం ఉదయం నుంచే ఐఆర్ జీసీ దళాలు జలసంధిలో గస్తీని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌‌‌‌పై ఇరాన్ గన్‌‌‌‌బోట్లు కాల్పులు జరిపాయి. మరో కంటైనర్ నౌకపై క్షిపణి వంటి ప్రొజెక్టైల్ దాడి జరగడంతో కంటైనర్లు దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో జలసంధి గుండా ఇండియాకు వస్తున్న 13 నౌకలను ఐఆర్​జీసీ పెట్రోలింగ్ నౌకలు అడ్డుకుని వెనక్కి పంపాయి. ఇరాక్ నుంచి చమురును తరలిస్తున్న ఒక సూపర్ ట్యాంకర్‌‌‌‌తో సహా రెండు భారత నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడంతో అవి వెనక్కి మళ్లాయి.

ప్రస్తుత పరిణామాలు..
నిజానికి ఇరాన్ పది రోజుల క్రితం జలసంధిని తెరిచినప్పటికీ, అమెరికా తన ‘బ్లాకేడ్’ (దిగ్బంధం) ఉపసంహరించుకోలేదు. దీనిని తమను మోసం చేయడమేనని భావించిన ఇరాన్, మళ్లీ జలసంధిని తన పూర్తి నియంత్రణలోకి తీసుకుని, అక్కడి నుంచి వెళ్లే నౌకలకు ‘టోల్ టాక్స్’, ‘ముందస్తు అనుమతి’ వంటి కఠిన నిబంధనలు పెట్టింది.

అమెరికా ‘నౌకాదళ దిగ్బంధం’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ఓడరేవులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఏ వస్తువు బయటకు వెళ్లకుండా, అలాగే బయటి నుంచి ఏ సరుకు ఇరాన్ లోపలికి రాకుండా అమెరికా నౌకలు అడ్డుకుంటున్నాయి. దీంతో ‘మా రేవులను మీరు దిగ్బంధిస్తే, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని మేము మూసివేస్తాము. మాకు వ్యాపారం లేనప్పుడు, వేరే ఎవరినీ ఇక్కడి నుంచి వ్యాపారం చేయనివ్వము’ అనేది ఇరాన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

అనుమతి లేకుంటే నో ఎంట్రీ
జలసంధిపై పట్టు సాధించిన ఇరాన్.. ఆ మార్గం గుండా వెళ్లే నౌకలకు కొత్త నిబంధనలను విధించింది. ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హెచ్చరికల ప్రకారం.. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇరాన్ నౌకాదళం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు, 'టోల్ టాక్స్' చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ సముద్రయాన చట్టాలకు విరుద్ధమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తన పట్టు సడలించడం లేదు.

వణుకుతున్న ప్రపంచ చమురు మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% హార్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. తాజా దాడులతో చమురు ట్యాంకర్ల ప్రయాణం నిలిచిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరగనున్నాయి.

శాంతి ప్రయత్నాలకు ఆఖరి అవకాశం
ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ వచ్చేవారంలో ముగియనుంది. ఈలోపు యుద్ధానికి శాశ్వతంగా విరామం ప్రకటించేలా చేసేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇస్లామాబాద్‌‌‌‌ వేదికగా ప్రత్యక్ష చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరు దేశాల మొండి వైఖరి ఆటంకంగా మారింది. అమెరికా చేస్తున్న ‘తప్పుడు అంచనాలు’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రిస్క్‌‌‌‌లో పడేస్తున్నాయని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్ జాదే ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరాన్ దౌత్యవేత్తకు సమన్లు
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధిని దాటడానికి యత్నించిన రెండు భారతీయ నౌకల వైపు ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడాన్ని భారత్  తీవ్రంగా ఖండించింది.రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడంతో ఆ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. 

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం.. భారత్ లోని ఇరాన్  రాయబారి మహమ్మద్  ఫతాలీని పిలిపించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్  చర్యను ఖండించింది. అలాగే, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్  కూడా ఈ ఘటనను ఖండించారు.