అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి.. ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు క్లోజ్

అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి.. ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు క్లోజ్
  • ఖతార్లోని అతిపెద్ద స్థావరం ఆల్ ఉదీద్పై మిసైల్స్​ వర్షం
  • ఇరాక్​లోని సైనిక స్థావరం పైనా ఎటాక్​
  • ఖతార్​, ఇరాక్​, బహ్రెయిన్, కువైట్ ఎయిర్​ స్పేస్​లు క్లోజ్.. విమానాల దారి మళ్లింపు
  • వార్​రూంలో ట్రంప్​ ఎమర్జెన్సీ మీటింగ్​
  • మూడు అణు స్థావరాలపై దాడికి ఇరాన్​ ప్రతిదాడి 
  • తమ దేశ సమగ్రతకు ముప్పు కలిగితే వదిలిపెట్టబోమని వార్నింగ్

టెహ్రాన్: తమ దేశ అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడికి ఇరాన్​ ప్రతిదాడికి దిగింది. ‘ఆపరేషన్​ బేషరత్​ ఫతా’ పేరుతో ఖతార్, ఇరాక్​​లోని అమెరికా ఎయిర్​బేస్​లపై విరుచుకుపడింది. ఖతార్‌లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్​పైనా మిసైల్స్​తో అటాక్​ చేసింది. అల్‌ ఉదీద్‌.. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్​ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్​ అయ్యారు. అమెరికాలోని వైట్​హౌస్​ వార్​రూంలో ఉన్నతాధికారులతో​ ఎమర్జెన్సీ మీటింగ్​ నిర్వహించారు. ఇదిలా ఉండగా.. తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతకు ముప్పు కలిగితే ఎవరినీ వదిలిపెట్టబోమని ఇరాన్​ వార్నింగ్​ ఇచ్చింది.

‘‘ఈ సక్సెస్ ​ఫుల్​ ఆపరేషన్​లో ప్రయోగించిన మిసైల్స్​ సంఖ్య.. ఇరాన్​ అణు కేంద్రాలపై దాడిలో అమెరికా ఉపయోగించిన బాంబుల సంఖ్యకు సమానం. టార్గెటెడ్​ ఎయిర్​ బేస్​ఖతార్​ పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలకు దూరంగా ఉంది. సామాన్య పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదు” అని ఇరాన్ సుప్రీం నేషనల్​ సెక్యూరిటీ కౌన్సిల్​ సెక్రటేరియెట్​ ప్రకటించింది.  అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ సోమవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.   ఒకవేళ ఇరాన్​  ప్రతీకార దాడులకు దిగితే..తాము మరింత విరుచుకుపడతామని అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్‌‌ ఇప్పటికే హెచ్చరించారు. ఈ పరిణామాల నడుమే ప్రతీకార దాడులు చోటుచేసుకోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొన్నది.

4 దేశాల ఎయిర్​స్పేస్​లు క్లోజ్​
ఆల్ ఉదీద్ ఎయిర్​బేస్పై ఇరాన్​ దాడికి కొన్ని గంటల ముందే  దేశంలోని తమ పౌరులకు సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలని ఖతార్​ను యూఎస్​ ఎంబసీ కోరింది. అయితే, ఈ షార్ట్​ నోటీసులో ప్రత్యేకమైన కారణాలు వెల్లడించలేదు. కాగా, ఇరాన్​ దాడితో ఖతార్ తోపాటు  ఇరాక్​, బహ్రెయిన్, కువైట్​లోని​ఎయిర్​స్పేస్​లను తాత్కాలికంగా క్లోజ్​ చేశారు.  దీంతో విమానాలన్నింటినీ  ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దోహా నుంచి మళ్లించాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఖతార్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. 

అలాగే, భారత పౌరులకు దోహాలోని ఇండియన్​ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. కొనసాగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఖతార్​లోని ఇండియన్​సిటిజన్స్​​జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగొద్దని సూచించింది.  తాజా అప్​డేట్స్​ కోసం ఇండియన్​ ఎంబసీ సోషల్​మీడియా చానెల్స్​తో కనెక్ట్​ అయి ఉండాలని పేర్కొన్నది. కాగా, తమ దేశంలోని అమెరికా ఎయిర్​బేస్​ అల్ ఉదీద్ పై ఇరాన్ దాడిని చేయడాన్ని ఖతార్ ఖండించింది. ఇది తమ సార్వభౌమాధికారం, గగనతలంపై తీవ్ర ఉల్లంఘన అని పేర్కొన్నది. దీనిపై అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నేరుగా స్పందించే హక్కు తమకు ఉందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ ఒక ప్రకటనలో తెలిపారు.