ఇరాన్ తన అణుశక్తిని ఒక ఆయుధంగా మలచుకోవాలనే ప్లాన్ లో ఉండగా.. ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో ఎదురవుతున్న డ్రోన్ సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తమపై మళ్లీ దాడులు జరిగితే.. తమ దగ్గర ఉన్న యురేనియంను 90 శాతం వరకు ఎన్‌రిచ్ చేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇలా చేయటం ద్వారా అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయికి యురేనియంను తీసుకెళ్తామని ఇరాన్ నేరుగా చెప్పడం ఉద్రిక్తతలను తీవ్ర స్థాయికి చేర్చింది.
ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఒక కొత్త రకమైన ముప్పును ఎదుర్కొంటోంది. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ వాడుతున్న ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారాయి. సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ ద్వారా పనిచేస్తాయి కాబట్టి వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా అడ్డుకోవచ్చు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు వైర్ల ద్వారా అనుసంధానించబడి ఉండటం వల్ల వాటిని జామ్ చేయడం అసాధ్యం. ఇవి రాడార్లకు కూడా చిక్కకుండా అత్యంత నిశ్శబ్దంగా వచ్చి లక్ష్యాలను ఛేదిస్తున్నాయి. ఈ సాంకేతికత ఇజ్రాయెల్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లోని లోపాలను బయటపెట్టింది.
►ALSO READ | అమెరికాలో భారతీయుడి ఉదారత..176 మంది గ్రాడ్యుయేట్లకు స్టూడెంట్ లోన్స్ చెల్లిస్తానని ప్రకటన
దీనికి కౌంటర్ గా ఇజ్రాయెల్ సైన్యం సొంతంగా 'సూసైడ్ డ్రోన్ల' తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. హిజ్బుల్లా వ్యూహాన్ని దెబ్బతీయడానికి భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ఉత్పత్తి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఉత్తర సరిహద్దుల్లో డ్రోన్ దాడుల వల్ల సైనికులు, ప్రజల ప్రాణాలు కోల్పోతుండటంతో ఇజ్రాయెల్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అటు ఇరాన్ అణు హెచ్చరికలు, ఇటు సరిహద్దుల్లో డ్రోన్ యుద్ధం వెరసి పశ్చిమ ఆసియాలో శాంతి స్థాపన అనేది ఇప్పట్లో జరిగేలా కనిపించటం లేదు.
ఇరాన్ ఇప్పటికే 60 శాతం ఎన్ రిచ్ చేసిన యురేనియం నిల్వలను కలిగి ఉంది. దీనిని 90 శాతానికి పెంచడం అంటే అది అణ్వాయుధ తయారీకి కేవలం అడుగు దూరంలో ఉన్నట్లే. అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యాల మధ్య దౌత్య ప్రయత్నాలు విఫలమైతే.. ఈ ప్రాంతం మరొక భారీ యుద్ధానికి వేదిక కాక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ప్రతీకార ధోరణి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
