30 శాతం పెరిగిన ఐఆర్​సీటీసీ లాభం

 30 శాతం పెరిగిన  ఐఆర్​సీటీసీ లాభం

న్యూఢిల్లీ :  భారతీయ రైల్వే  పర్యాటక,  క్యాటరింగ్ విభాగమైన ఐఆర్​సీటీసీ ఈ ఏడాది సెప్టెంబర్​తో ముగిసిన క్వార్టర్​లో రూ. 295 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాది కాలంలో పోస్ట్ చేసిన రూ. 226 కోట్లతో పోలిస్తే 30శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం  వార్షికంగా 23శాతం పెరిగి రూ.995 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే క్వార్టర్​లో రూ.806 కోట్లు వచ్చాయి. కంపెనీ బోర్డు  2024 ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుకు రూ. 2.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను ఆమోదించింది.  

అర్హతగల వాటాదారులను గుర్తించడానికి నవంబర్ 17 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన,  పన్ను తర్వాత లాభం 27శాతం పెరిగి రూ. 232 కోట్లకు చేరింది.  సెగ్మెంట్ వారీగా చూస్తే, తాజా క్వార్టర్​లో క్యాటరింగ్ సెగ్మెంట్ నుండి వచ్చే ఆదాయం 29శాతం పెరిగి రూ.431 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం రూ.334 కోట్లుగా ఉంది.  రైల్ నీర్ సెగ్మెంట్ ఆదాయం 4శాతం పెరిగి రూ.78 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది కాలంలో రూ.75 కోట్లుగా ఉంది.  ఇంటర్నెట్ టికెటింగ్ వ్యాపార ఆదాయాలు 9శాతం పెరిగి రూ. 327 కోట్లకు చేరుకున్నాయి. 

గత ఏడాది ఇదే క్వార్టర్​లో రూ. 300 కోట్లు వచ్చాయి.  పర్యాటక వ్యాపార ఆదాయాలు 39శాతం పెరిగి రూ.96.5 కోట్లకు చేరుకున్నాయి.  రాష్ట్ర తీర్థ సెగ్మెంట్ నుండి గత ఏడాది రూ. 29.6 కోట్లుగా ఉన్న ఆదాయం తాజా క్వార్టర్​లో రెండింతలు పెరిగి 64.8 కోట్లకు చేరుకుంది. ఇబిటా వార్షికంగా 20శాతం పెరిగి రూ. 366 కోట్లకు పెరిగింది. మార్జిన్లు 36.8శాతం ఉన్నాయి.  మంగళవారం ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో కంపెనీ షేర్లు 1.68శాతం లాభంతో రూ.682.75 వద్ద ముగిశాయి.