వచ్చే నెల 17న ప్రారంభం.. 19 నుంచి ట్రైన్ పరుగులు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే నడుపుతున్న ప్రైవేటు ట్రైన్ తేజస్.. అహ్మదాబాద్, ముంబై మధ్య పరుగులు తీయనుంది. ఢిల్లీ, లక్నో మధ్య ఇప్పటికే తొలి తేజస్ ట్రైన్ నడుస్తుండగా.. అహ్మదాబాద్, ముంబై మధ్య రెండో ట్రైన్ త్వరలో ప్రారంభం కానుంది. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రీమియం ట్రైన్‌ను జనవరి 17న లాంచ్ చేసే అవకాశం ఉందని, అదే నెల 19 నుంచి కమర్షియల్ ప్రయాణాన్ని తేజస్ ప్రారంభిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. వారానికి ఆరు రోజులు ప్రయాణించే ఈ ట్రైన్ ను.. గురువారం మాత్రం మెయింటెనెన్స్ కోసం నిలిపేస్తారు. ఎయిర్‌లైన్స్ మాదిరిగానే ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఈ ట్రైన్ లో అందుబాటులో ఉంటాయి.
ఎన్నో స్పెషాలిటీలు..
- ఏదైనా కారణంతో ఈ ట్రైన్ ఆలస్యమైతే ప్రయాణికులకు నష్టపరిహారం అందిస్తారు. గంటకుపైగా లేట్ అయితే రూ.100, రెండు గంటలకు పైగా లేట్ అయితే రూ.250 అందిస్తారు.
- ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే రూ.25 లక్షల వరకు రైల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. దోపిడీ జరిగి ప్రయాణికులు తమ వస్తువులు, సొమ్మును కోల్పోతే రూ.లక్ష వరకు కాంప్లిమెంటరీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తారు.
- విమానాల్లో మాదిరిగానే ట్రాలీల్లో హైక్వాలిటీ ఫుడ్, బేవరేజస్ను ప్రయాణికులకు అందిస్తారు. టికెట్ చార్జ్లోనే వీటి ధరా కలిపి ఉంటుంది. ఆయా ప్లేస్ల్లో దొరికే ప్రత్యేక ఫుడ్ ఐటమ్స్‌ను ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్ సీటీసీ సన్నాహాలు చేస్తోంది.
- ప్రతి ప్రయాణికులకు ప్రత్యేకంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందిస్తారు. దీనికి అదనంగా ప్రతి కోచ్‌లోనూ ఒక ఆర్వో వాటర్ ఫిల్టర్‌ను అందుబాటులో ఉంచుతారు.
- ఆ రూట్లో నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఫేర్ కు అనుగుణంగానే తేజస్ రైలులో టికెట్ చార్జ్ ఉంటుంది. సాధారణ రోజుల్లో శతాబ్ది చార్జే ఉంటుంది. పీక్ పిరియడ్‌లో 20 శాతం అద నంగా, ఫెస్టివల్ సీజన్లో 30 శాతం అదనంగా చార్జ్ చేస్తారు.
- ట్రైన్ క్యాన్సిల్ అయితే కన్ఫర్మ్ అయిన, వెయిటింగ్ లిస్ట్ ఈ టికెట్లకు ఫుల్ రిఫండ్ ను ఆటోమేటిక్‌గా అందిస్తారు. టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సిన లేదా టీడీఆర్ ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు.
- తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ కోటా ఉండదు. జనరల్, ఫారిన్ టూరిస్ట్ కోటా మాత్రమే ఉంటాయి. ఫారిన్ టూరిస్ట్ కోటా కింద ఎగ్జిక్యుటీవ్ క్లాస్‌లో ఆరు, చైర్ కార్ క్లాస్‌లో 12 సీట్లు ఫారిన్ టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి.
