సోషల్​ ఆడిట్​లో బయటపడిన అక్రమాలు

సోషల్​ ఆడిట్​లో బయటపడిన అక్రమాలు
  •     సోషల్​ ఆడిట్​లో బయటపడిన అక్రమాలు
  •     ప్రజావేదికలో వెల్లడించిన తనిఖీ బృందం

హుస్నాబాద్​, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలంలో జరిగిన ఉపాధి పనులపై నిర్వహించిన సోషల్ఆడిట్​లో గుర్తించిన అవకతవకలపై  ప్రజావేదిక నిర్వహించారు. 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన రూ.3.15 కోట్ల  ఉపాధి హమీ పనులపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన వివరాలను  గురువారం ఎంపీడీవో ఆఫీసులో చదివి వినిపించారు. గ్రామపంచాయతీల్లో జరిగిన పనులు, రికార్డుల్లో నమోదైన వివరాలు, నిధుల దుర్వినియోగాన్ని తనిఖీ బృందం సభ్యులు వెల్లడించారు.

ప్రతి గ్రామంలో జరిగిన పనులు, కొలతల్లో తేడాలు ఉన్నాయని, మస్టర్ ముగిశాక కూడా చెల్లింపులు జరిపారని గుర్తించారు. పని జరిగిన ప్రాంతంలో ఉపాధి హామీ బోర్డులు ఏర్పాటు చేయకుండా నిధులు తీసుకున్నారని, కొన్ని గ్రామాల్లో ఎంబీ కాకుండా పేమెంట్స్ జరిగాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. పనులకు ముందు తర్వాత కొలతలు లేకుండానే చెల్లింపులు జరిగాయని తెలిపారు.

కూలీల పేర్లపై ఇతరులకు బిల్లులు చేశారు. రికార్డుల్లో ఉన్న పనులు  క్షేత్రస్థాయిలో లేవని గుర్తించారు. పని జరిగిన ప్రదేశాల్లో శిలాఫలకాలు పెట్టకుండా బిల్లులు తీసుకున్నారని, మస్టర్లలో, రికార్డుల్లో వివరాలు సరిగా నమోదు చేయలేదన్నారు.  పంచాయతీల వారీగా డీఆర్పీలు వెల్లడించిన వివరాలను అడిషనల్ పీఆర్​డీవో కౌసల్యాదేవి, ఏపీడీ ఓబులేశ్​, విజాలెన్స్​ఆఫీసర్​ప్రభాకర్​ నమోదు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులపై డబ్బును రికవరీ చేయాలని, సంబంధిత సిబ్బందికి తాఖీదులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సరైన రికార్డులు లేకపోవడంతో రూ.6వేలు ఫైన్​ విధించారు. రూ.3,161 రికవరీ చేయాలని ఆదేశించారు.