పోస్టు లేకున్నా క్రియేట్​ చేసిన్రు .. భద్రాద్రికొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో కొనసాగుతున్న అవకతవకలు

పోస్టు లేకున్నా క్రియేట్​ చేసిన్రు .. భద్రాద్రికొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో కొనసాగుతున్న అవకతవకలు
  • ఓపెన్​ స్కూల్​ జిల్లా కో ఆర్డినేటర్​ పోస్టు లేకున్నా కొత్తగా పెట్టిన్రు..
  • చివరి నిమిషమంటూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
  • గతంలోనూ సర్దుబాటు పేర అక్రమ డిప్యూటేషన్లు!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓపెన్​ స్కూల్​కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్​ మాత్రమే ఉన్నారు. ఆయన పరిధిలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొనసాగుతోంది. కానీ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఓపెన్​ స్కూల్​ జిల్లా కో ఆర్డినేటర్​ పోస్టు లేకున్నా క్రియేట్​ చేశారు. గతంలోనూ టీచర్ల డిప్యూటేషన్ల విషయంలో జిల్లా విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి.  

‘చివరి నిమిషం’ అంటూ ..

తెలంగాణ ఓపెన్​ఎడ్యుకేషన్​ సొసైటీని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. న్యూ ఇండియా లిటరసీలో భాగంగా అడల్ట్​ ఎడ్యుకేషన్​పై ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. అండర్​ స్టాండింగ్​ ఆఫ్​ లైఫ్​ లాంగ్​ లెర్నింగ్​ ఆఫ్​ ఇన్​ సొసైటీ పేర 14 ఏండ్లకు పైగా వయసు గల వారిలో డ్రాపవుట్స్​ను గుర్తించడంతో వయోజనుల్లో విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్​కు అవసరమైన సాయం అందించేందుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకరిని ఇన్​చార్జిగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ పోస్టు నియామకానికి సంబంధించి నిబంధనల ప్రకారంగా డీఈవో నోటిఫికేషన్​ ఇవ్వాల్సి ఉంది. 

ఇంట్రస్ట్​ ఉన్న హెచ్​ఎంలతో పాటు సీనియర్​ స్కూల్​ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకుంటారు. వారిలో ఒకరిని ఇన్​చార్జిగా నియమించాల్సి ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కలెక్టరేట్​లో ఎలక్షన్​ సెల్​లో కొన్నేండ్లుగా డిప్యూటేషన్​పై పనిచేస్తున్న ఓ టీచర్​ను ‘చివరి నిమిషం’ అంటూ మూడు రోజుల కింద జిల్లా విద్యాశాఖ జిల్లా కో ఆర్డినేటర్​ పేర తీసుకోవడం టీచర్లలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.  విద్యాహక్కు చట్టం ప్రకారంగా టీచర్​ స్కూల్​లోనే ఉంటూ స్టూడెంట్స్​కు పాఠాలు నేర్పించాల్సి ఉంది. ఇతర డిపార్ట్​మెంట్లకు వెళ్లాల్సి ఉంటే ఫారెన్​ సర్వీస్​ కింద వెళ్లాలి. కానీ స్కూల్​లో జీతం తీసుకుంటూ కొన్నేండ్లుగా డిప్యూటేషన్​పై విద్యాశాఖకు సంబంధం లేని డిపార్ట్​మెంట్లలో ఈ టీచర్​ పనిచేస్తున్నాడు. కాగా, దుమ్ముగూడెం మండలంలోని రామారావుపేటలో పనిచేస్తున్న ఈ టీచర్​ను స్కూల్​ నుంచి ఈనెల 14న ఎంఈవో రిలీవ్​ చేశారు. 
 
గతంలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు..

జిల్లా విద్యాశాఖలో ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. గతేడాది టీచర్ల సర్దుబాటులో భాగంగా చేపట్టిన డిప్యూటేషన్లలో అక్రమాలు జరిగాయంటూ పలువురు టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్​ ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళనలు చేపట్టారు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా టీచర్ల సర్దుబాటులో భాగంగా నిబంధనల ప్రకారంగానే డిప్యూటేషన్లు చేయాలంటూ గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు యూటీఎఫ్​ నేతలు వినతిపత్రం కూడా ఇచ్చారు. 

కలెక్టర్​ ఆదేశాల మేరకే నియామకం.. 

కలెక్టర్​ ఆదేశాల మేరకే ఓపెన్​ స్కూల్​ జిల్లా కో ఆర్డినేటర్​గా సాయి కృష్ణ అనే టీచర్​ను తీసుకున్నాం. పలువురు టీచర్లను అడిగాం. ఎవరూ ముందుకు రాలేదు. అలాంటప్పుడు నోటిఫికేషన్​ అవసరం లేదు.

ఎం. వెంకటేశ్వరాచారి, డీఈవో, భద్రాద్రికొత్తగూడెం

ఉమ్మడి జిల్లాకే కో ఆర్డినేటర్​..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఓపెన్​ స్కూల్​ జిల్లా కో ఆర్డినేటర్​ పోస్టు ఉంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు  ప్రత్యేకంగా జిల్లా కో ఆర్డినేటర్​ పోస్టు లేదు. కానీ జిల్లాలో అవసరాల నిమిత్తం ఇన్​చార్జిగా ఒకరిని తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారికి సూచించాం. దీనిపై విచారణ చేపడుతాం.

పాపారావు,  ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఓపెన్​ స్కూల్​ కో ఆర్డినేటర్