చెక్ డ్యాంలు, బ్రిడ్జి పనుల్లో తారస్థాయికి అవినీతి

చెక్ డ్యాంలు, బ్రిడ్జి పనుల్లో తారస్థాయికి అవినీతి
  • సబ్ కాంట్రాక్టర్ల మాయా జాలం
  • రూ.  82 లక్షలతో  బ్రిడ్జి నిర్మాణం 
  • పునరుద్ధరణకు మళ్లీ ఎస్టిమేషన్లు రెడీ   

మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో భారీ  సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. చెక్ డ్యాంలు, బ్రిడ్జి పనుల్లో కూడా అవినీతి తారస్థాయికి చేరుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తక్కెళ్ల పాడులో నాలుగేండ్ల కింద నిర్మించిన  పైప్ కాజ్ వే రోడ్డు పికప్  బ్రిడ్జి ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది.  పొలాలకు వెళ్లేందుకు, ధాన్యం రవాణాకు ఉపయోగపడిన ఈ  బ్రిడ్జి పాలేరు వాగు వరద కారణంగా కూలిపోవడంతో రైతులకు మళ్లీ కష్టాలుమొదలయ్యాయి. సబ్​ కాంట్రాక్టర్​ ఆధ్వర్యంలో జరిగిన బ్రిడ్జి నిర్మాణం మీద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, క్వాలిటీ చెక్​ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సాంక్షన్​ అయ్యింది రూ. 1.52 కోట్లు 

పాలేరు వాగు పై బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 1.52 కోట్లు మంజూరయ్యాయని, వంద మీటర్ల పైప్ కాజ్ వేతో పాటు ఇరువైపులా  34 మీటర్ల సైడ్ వాల్స్ పనులను రూ. 82 లక్షలతో పూర్తి చేసినట్లు ఇరిగేషన్​ అధికారులు తెలిపారు. 2016 లో  పనులు మొదలుపెట్టగా 2018 లో కంప్లీటైనట్లు చెప్పారు. పాలేరు వాగు వరదను అంచనా వేయకుండానే తక్కెళ్ల పాడు వంతెన నిర్మించడం వల్లనే అది కూలిపోయిందని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి కట్టిన బ్రిడ్జి నాలుగేళ్లకే కుప్పకూలడంతో కాంట్రాక్టర్లకు, ఆఫీసర్లకు మధ్య అవినీతి బంధం బయటపడినట్టయ్యింది.  

పునరుద్ధరణ కు రూ. 39 లక్షలు అవసరం 

ఈ నెల 9న రాత్రి తక్కెళ్ల పాడు వద్ద పాలేరు వాగు పై బ్రిడ్జి కూలినట్టు సమాచారం రావడంతో మర్నాడు వెళ్లి  పరిశీ లించినట్టు ఇరిగేషన్​ శాఖ మిర్యాలగూడ  డీఈ జనార్దన్ తెలిపారు. నీటిప్రవాహానికి తూటి కూర అడ్డుపడి సైడ్ వాల్స్ కూలినట్టు, ఎడమ వైపు  మరో 30 మీటర్లు సైడ్ వాల్ నిర్మించి ఈ ప్రమాదం జరిగిఉండేది కాదన్నారు.  పునరుద్ధరణ పనులకు రూ. 39 లక్షలతో ఎస్టిమేట్స్​ తయారు చేసినట్టు చెప్పారు.