​​​​​మొన్న దుబ్బాక, హుస్నాబాద్, ఇప్పుడు చేర్యాల, అల్లీపూర్

​​​​​మొన్న దుబ్బాక, హుస్నాబాద్, ఇప్పుడు చేర్యాల, అల్లీపూర్
  • విషయం బయటికి పొక్కకుండా విశ్వప్రయత్నాలు
  • విచారణ ప్రారంభించిన అధికారులు 

సిద్దిపేట జిల్లాలోని పీఏసీఎస్ లలో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల దుబ్బాక సొసైటీలో రూ.34 లక్షలు, హుస్నాబాద్ సొసైటీలో రూ.70 లక్షల అవకతవకలు మరవకముందే ఇప్పుడు చేర్యాల సొసైటీలో 7.50 లక్షలు పక్కదారి పట్టిన విషయం వెల్లడైంది. అలాగే చిన్నకోడూరు మండలం అల్లీపూర్​లోనూ రూ.20 లక్షలు గోల్​మాల్​అయినట్లు తెలుస్తోంది. వీటిపై ఆఫీసర్లు విచారణ చేపడుతున్నారు. 

సిద్దిపేట, వెలుగు :  ఎరువులు అమ్మిన డబ్బులను సొసైటీ ఖాతాలో జమయేయకుండా చేర్యాల పీఏసీఎస్ బాధ్యులలో కొందరు సొంతానికి వాడుకున్నట్టుగా డీసీవో తనిఖీల్లో వెల్లడైంది. చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన 30 గ్రామాల్లోని 15 వేల మంది రైతులు చేర్యాల సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సీజన్ లో రైతులకు  ఫర్టిలైజర్ పంపిణీ చేయలేదు. గతంలో అమ్మకాలకు సంబంధించి డబ్బులు జమ చేయకపోవడంతో ఎరువులు రానట్టు తెలిసింది. కొందరు ఈ విషయాన్ని గుర్తించి డీసీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ  చేపట్టారు. రూ.7.50 లక్షల రూపాయలు  దారిమళ్లినట్టుగా గుర్తించి బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. ఏడాది కింద  ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇదే పీఏసీఎస్ పరిధిలో దాదాపు రూ.2.50 కోట్ల మేర అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు సొసైటీ సీఈవోను సస్పెండ్ చేయడంతో పాటు మరి కొందరిపై కేసులు నమోదు చేశారు.  తాజాగా మళ్లీ అక్రమలు జరగడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

అల్లీపూర్ కొందరి చేతివాటం.. 

చిన్నకోడూరు మండలం అల్లీపూర్ సొసైటీలో రుణాల చెల్లింపు విషయంలో కొందరు చేతి వాటాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తోంది. అప్పులు కట్టిన రైతులకు రిసిప్ట్​ ఇచ్చినా, డబ్బులు సొసైటీలలో జమ చేయకుండా రూ.20 లక్షలు కాజేశారు.  విఠలాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ఏడాది కిందనే సొసైటీ రుణాన్ని చెల్లించి రశీదును పొందారు. ఇటీవల అదే రైతుకు వడ్డీతో సహా రుణం చెల్లించాలని నోటీస్​ జారీ అయింది. నోటీస్ కాపీని నియోజకవర్గ ఓ ముఖ్య నేతకు వాట్సప్ లో పంపడంతో విషయం బయటపడకుండా వాడుకున్న డబ్బులను తిరిగి సొసైటీలో జమ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది కాలంగా  రైతుల రుణాలకు సంబంధించి వాడుకున్న డబ్బుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు వడ్డీతో  సహా  తిరిగి చెల్లించినట్టు సమాచారం. మిగతా డబ్బులను ఒకటి, రెండు రోజుల్లో చెల్లించి  వివాదం నుంచి బయటపడటానికి సొసైటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలియడంతో  దీనిపై డీసీవో విచారణ జరిపిస్తున్నారు.

ఎంక్వైరీ పేరిట డిలే.. 

జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరుగుతున్న విషయం వెల్లడైనా విచారణలో డిలే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుబ్బాక సొసైటీలో రూ. 34 లక్షలు దారి మళ్లిన ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇంకా స్టాట్యూటరీ ఎంక్వైరీ సాగుతూనే ఉంది. నెల రోజుల కింద హుస్నాబాద్ సొసైటీలో రూ.70 లక్షల మేర  అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినా  ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. అవకతవకల విషయం వెల్లడైన నాలుగైదు రోజుల్లోనే ప్రిలిమినరీ ఎంక్వైరీని పూర్తి చేసి నిబంధనల ప్రకారం స్టాట్యూటరీ ఎంక్వైరీని ప్రారంభిస్తామని అధికారులు చెప్పి రోజులు గడుస్తున్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. చేర్యాల, అల్లీపూర్ సొసైటీల్లో అక్రమాలపై  ఫిర్యాదులు అందినా విచారణ పేరిట జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని సొసైటీల్లో అవకతవకలకు అడ్డుకట్టవేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 21 సొసైటీలు ఉంటే ఇప్పటి వరకు  12 సొసైటీల్లో అడిట్ ను పూర్తి కాగా, మరో 9 సొసైటీల్లో ఆడిట్ ను నిర్వహించాల్సి   ఉంది.

రెండు సొసైటీల్లో అక్రమాలు వాస్తవమే

అల్లీపూర్ సొసైటీల్లో నిధులు దారి మళ్లిన విషయం వాస్తవమే. చేర్యాల సొసైటీలో  ఫర్టిలైజర్ అమ్మకాలకు సంబంధించిన రూ.7.50 లక్షలను సొంతానికి వాడుకున్నారు. దీనిపై విచారణ జరిపి నోటీసులు జారీ చేశాం. దుబ్బాక సొసైటీకి సంబంధించి స్టాట్యూటరీ ఎంక్వైరీ నివేదిక రావాల్సి  ఉంది. హుస్నాబాద్ సొసైటీ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇంకా రాలేదు.  దీనిపై  స్టాక్ వెరిఫికేషన్ పూర్తి కాలేదు. వెల్లంపల్లిలో స్టాక్ వెరిఫికేషన్ తోపాటు  గోల్డ్ లోన్ల వివరాలను సేకరిస్తున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తి కాగానే కో ఆపరేటివ్ నిబంధనల ప్రకారం  స్టాట్యూటరీ ఎంక్వైరీని ప్రారంభిస్తాం. 

-  చంద్రమోహన్ రెడ్డి, డీసీవో