గడువుకు ముందే..టెండర్ క్లోజ్!

గడువుకు ముందే..టెండర్ క్లోజ్!
  •     సివిల్ సప్లై స్టేజీ–2 ఆన్ లైన్ టెండర్‌‌‌‌పై అనుమానాలు 
  •     కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ముందుగానే  క్లోజ్ చేశారని ఆరోపణలు 
  •     టెండర్‌‌‌‌ రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని ప్రజావాణిలో ఫిర్యాదు..

సూర్యాపేట, వెలుగు : సివిల్ సప్లై మండల లెవెల్ స్టాక్ పాయింట్(ఎం‌‌ఎల్‌‌ఎస్ స్టేజీ–2) ట్రాన్స్ పోర్ట్ టెండర్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ పాయింట్ నుంచి రేషన్ షాపులు, అంగన్ వాడీ కేంద్రాలు, స్కూళ్లకు రేషన్ బియ్యం ట్రాన్స్ పోర్ట్  కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌‌లో ఆన్ లైన్ అప్లికేషన్ల గడువు ముగియకముందే సైట్‌‌ క్లోజ్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కొందరికి లబ్ధి చేకూర్చేందుకే చివరి తేదీకి ముందే టెండర్ క్లోజ్ చేసినట్లు పలువురు టెండర్ దారులు ఆరోపిస్తున్నారు. టెండర్‌‌‌‌ను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని సోమవారం కలెక్టరేట్‌‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 

ఒకరోజు ముందుగానే సైట్ క్లోజ్ 

సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి ఎం‌‌ఎల్‌‌ఎస్ పాయింట్ల నుంచి 2023–-25 -సంవత్సరానికి  జిల్లాలోని రేషన్ షాపులకు సరుకులు రవాణా చేసేందుకు ఆన్ లైన్ టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2 నుంచి 9 వరకు అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకొని ఈ నెల 10 వరకు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. అదే సెట్‌‌ను మాన్యువల్‌‌గా ఈ నెల 12 వరకు డీఎం కార్యాలయంలో టెండర్‌‌‌‌ బాక్సులో వేయాలని సూచించారు.  కానీ,  ఆన్ లైన్ సైట్‌‌ను అధికారులు ఈ నెల 9వ తేదీనే క్లోజ్ చేశారు. దీంతో చాలామంది అప్లికేషన్లు డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నా ఆన్‌‌లైన్ సబ్మిషన్‌‌కు అవకాశం లేకుండా పోయింది.  

గతంలో ఒక్కో ఎం‌‌ఎల్‌‌ఎస్  పాయింట్ కు 10 నుంచి 20 టెండర్లు వేశారు.  కానీ, ప్రస్తుతం  ఒక్కో ఎం‌‌ఎల్‌‌ఎస్  పాయింట్లకు ఒకటి, రెండు టెండర్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఒక రోజు ముందుగానే సైట్  క్లోజ్ చేయడంతో  టెండర్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.  దీని వెనుక సివిల్ సప్లై, రెవెన్యూ అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.  

టెండర్‌‌ రద్దు చేయాలి 

సివిల్ సప్లై స్టేజీ 2 కాంట్రాక్టుల్లో  పాత వారికి లబ్ది చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరించారు.  పాత కాంట్రాక్టర్లు అధికారులను మేనేజ్ చేసి ఒక రోజు ముందుగానే ఆన్‌‌లైన్‌‌ సైట్ క్లోజ్ చేయించారు.  టెండర్‌‌‌‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.  

పొదిళ్ల సత్యనారాయణ, టెండర్‌‌‌‌ దారుడు

రెండో శనివారం కావడంతోనే..

9న రెండో శనివారం కావడంతో ఆన్ లైన్‌‌లో అప్లై చేసుకునే అవకాశం ఇవ్వలేదు. ఇందుకోసం ఒక రోజు ముందుగానే కొలీజియం ఆర్డర్స్ ఇచ్చినం. ప్రిబిడ్డింగ్ ముందు రోజు కూడా సమాచారం అందించిన. అయినా  కొందరు టెండర్‌‌‌‌దారులు అప్లై చేసుకోలేదు. 

 వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, సూర్యాపేట