కాళేశ్వరం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమాలు

 కాళేశ్వరం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​జిల్లాలోని సదర్​మాట్​ఆనకట్ట, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 కాల్వల నిర్మాణం కోసం సేకరించిన భూముల పరిహారం పంపిణీలో అక్రమాలు జరిగాయి. కొందరు రైతులు తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇదంతా నిర్మల్ లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్​లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి.  రూ. 8 లక్షల విలువ చేసే రెండు చెక్కులు ఆఫీసర్లు సొంతానికి వాడుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్​ అయ్యారు. విజిలెన్స్​ విచారణ కోసం సిఫారసు చేశారు. గతంలో కూడా పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.50 లక్షలు పక్కదారి పట్టినట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే రైతుల అవగాహన లోపం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అవకతవకలు వెలుగు చూడలేదని తెలిసింది. ఇటీవల కొంతమంది రైతులు తమకు అందిన పరిహారంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎనిమిది లక్షల రూపాయల విలువైన రెండు చెక్కులు డిప్యూటీ కలెక్టర్​ ఆఫీస్​ సిబ్బంది సొంతానికి వాడుకున్నట్లు తేలింది. దీంతో బాధితులు కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ సైతం ప్రాథమికంగా విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై  విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

ఏళ్ల నుంచి ఇదే తంతు...

ముంపు బాధితులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో చాలా రోజుల నుంచి అవకతవకలు జరుగుతున్నాయి. పలుకుబడి, పరపతి గల కొందరు పరిహారం డబ్బుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. పలుకుబడిని అడ్డంపెట్టుకొని సేకరించిన భూముల విలువలను సైతం తలకిందులు చేసి దండుకున్నారు. కొందరి భూములకు ఎక్కువ ధర.. అమాయక రైతులకు తక్కువ ధర చెల్లించారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది బాధితులకు తెలయకుండానే చెక్కులు పక్కదారిపట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా ఈ తతంగం  సాగుతున్నా.. బయటకు రాలేదు. ఇటీవల రూ. 8 లక్షల చెక్కులు రెండు మిస్​ కావడంతో అసలు విషయం బయటపడింది. ఆ చెక్కులను కొందరు డ్రా చేసుకొని సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది.

విజిలెన్స్ విచారణకు ఆదేశించాం

నిర్మల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్​లో జరిగిన పరిహారం అవకతవకలపై విజిలెన్స్​ విచారణకు ఆదేశించామని గత కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ తెలిపారు. ఆఫీస్​లో రూ. 8 లక్షల విలువ చేసే రెండు చెక్కులు మాయమైనట్లు తేలిందన్నారు. ఇంకా చాలామంది రైతులు ఫిర్యాదు కూడా చేశారన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయి.