గురుకుల టీచర్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌లో అక్రమాలు: ఆర్‌‌‌‌.కృష్ణయ్య

గురుకుల టీచర్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌లో అక్రమాలు: ఆర్‌‌‌‌.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల టీచర్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీంతో 4 వేల మందికి అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. నియామకాల్లో జరిగిన తప్పును వెంటనే సరిదిద్దకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, గురుకుల అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్‌‌ విద్యానగర్‌‌‌‌లోని బీసీ భవన్‌‌లో ఆర్.కృష్ణయ్యను కలిశారు. తమ సమస్యలను వివరించి, ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, గురుకుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పోస్టులను అవరోహణ క్రమంలో నింపకుండా బ్యాక్‌‌లాగ్‌‌ పోస్టులను మిగిలేలా భర్తీ ప్రక్రియను చేపట్టారని ఆరోపించారు. 

వెంటనే 9,210 పోస్టులను బ్యాక్‌‌లాగ్‌‌ లేకుండా నింపాలని, లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అలాగే, డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. టెట్ లేకుండా డీఎస్సీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ చైర్మన్ నీలా వెంకటేశ్‌‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, గురుకుల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని, లేకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.