ఎస్సారెస్పీ పునరుజ్జీవం ఖర్చు డబుల్!

ఎస్సారెస్పీ పునరుజ్జీవం ఖర్చు డబుల్!

హైదరాబాద్‌‌, వెలుగు:

ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయం ఏడాదిన్నరలోనే డబుల్​ అవుతోంది. మొదట్లో రూ.1,067 కోట్ల అంచనాతో ప్రాజెక్టు మొదలుపెట్టగా.. మధ్యలోనే రూ.1,751 కోట్లకు పెంచేశారు. ఇప్పుడు పలు కొత్త పనులు, కాల్వకు లైనింగ్‌‌, కట్ట బలోపేతం వంటి పనుల పేరుతో కాంట్రాక్టు సంస్థ మరో రూ.248.1 కోట్లకు టెండర్‌‌ పెట్టింది. వీలైనంత త్వరగా రివైజ్డ్‌‌ ఎస్టిమేట్‌‌కు అనుమతివ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదించింది. దీనికి ఓకే చెప్తే పునరుజ్జీవన పథకం ఖర్చు అంచనా కన్నా రూ. 932.56 కోట్లు పెరిగిపోనుంది. వ్యయం ఈ స్థాయిలో పెరగడంపై ఇరిగేషన్‌‌ ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రూ.1,067 కోట్లతో మొదలుపెట్టి..

ఎస్సారెస్పీ​ స్టోరేజీ కెపాసిటీ 90.31 టీఎంసీలుకాగా గడిచిన 20 ఏళ్లలో సగటున 54 టీఎంసీల నీళ్లు మాత్రమే ప్రాజెక్టులోకి చేరాయి. ఈ లోటును పూడ్చడానికి కాళేశ్వరం నుంచి తీసుకునే నీటిలోంచి 60 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 2017 జూన్‌‌ 17న రూ.1,067 కోట్ల అంచనాతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పేరిట ప్రాజెక్టును మంజూరు చేసింది. పనులు చేసేందుకు ఇరిగేషన్‌‌ శాఖ టెండర్లు పిలవగా.. నవయుగ ఇంజనీరింగ్‌‌ కంపెనీ 4.68 శాతం ఎక్సెస్‌‌  కోట్‌‌ చేసి పనులను దక్కించుకుంది.

వరద కాల్వ ద్వారా..

పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా వరద కాల్వ ద్వారా 60 రోజుల్లో 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం మూడు దశల్లో పంపుహౌస్‌‌లను ప్రతిపాదించారు. వాటి వద్ద మూడు క్రాస్‌‌ రెగ్యులేటర్ల ఏర్పాటు, వరద కాల్వ కట్ట బలోపేతం, బలహీనంగా ఉన్నచోట రిపేర్లు చేయాలి. పంపుహౌస్‌‌లకు నీటిని తరలించేందుకు అప్రోచ్‌‌ చానళ్లు.. ఒక్కో పంపుహౌస్‌‌లో 6.5 మెగావాట్ల కెపాసిటీ ఉండే 8 మోటార్లు, డెలివరీ మెయిన్స్‌‌, డెలివరీ సిస్టర్న్‌‌, లీడ్‌‌ చానల్‌‌, ఎలక్ట్రో మెకానికల్‌‌, హైడ్రో మెకానికల్‌‌, ఇన్‌‌ఫాల్‌‌ రెగ్యులేటర్‌‌, డెలివరీ సిస్టర్న్‌‌లకు అడ్డంగా డీఎల్‌‌ఆర్‌‌ బ్రిడ్జిలు నిర్మించాలి. అయితే.. రెండు పంపుహౌస్‌‌ల్లో మోటార్ల ఏర్పాటుకు సివిల్‌‌, కాంక్రీట్‌‌ పని పూర్తి చేశారు. ఒక్కో పంపుహౌస్‌‌లో ఐదేసి మోటార్లను పంపింగ్‌‌కు సిద్ధం చేశారు. మిగతా పనులు జరుగుతున్నాయి. మూడో మూడో పంపుహౌస్‌‌లో పెద్దగా పనులు చేపట్టలేదు. ఈ క్రమంలోనే పునరుజ్జీవన పథకం వ్యయాన్ని రూ.1,751.46 కోట్లకు పెంచాలని ఈ ఏడాది జూన్​లో కాంట్రాక్టు సంస్థ ప్రతిపాదించగా సర్కారు ఓకే చెప్పింది.

జీవోలు బయటికి రాలే..

పునరుజ్జీవం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచిన సర్కారు.. అందుకు సంబంధించిన జీవోలను బయటికి రానివ్వలేదు. ఇంటర్నల్‌‌ సర్క్యులేషన్‌‌లో మినహా మరెవరికీ కనబడకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. మొదటి ఎస్టిమేషన్‌‌లో 39,87,408 క్యూబిక్‌‌ మీటర్ల మట్టి పనిచేయాల్సి ఉండగా 39,59,622 క్యూబిక్‌‌ మీటర్లకు తగ్గిందని, కాంక్రీట్‌‌ పనులు 5,79,719 క్యూబిక్‌‌ మీటర్ల నుంచి 6,14,977 క్యూబిక్‌‌ మీటర్లకు పెరిగాయని ఇరిగేషన్​ శాఖ తెలిపింది. 14,679.82 టన్నుల స్టీల్‌‌ అవసరమని అంచనా వేయగా.. 17,100.21 టన్నులు వాడామని, హైడ్రో మెకానికల్‌‌ పనులు 5,230 టన్నుల నుంచి 5,383.09 టన్నులకు పెరిగాయని.. అందుకే ప్రాజెక్టు వ్యయం రూ.1,067 కోట్ల నుంచి రూ.1,751 కోట్లకు పెరిగిందని పేర్కొంది.