ఇరిగేషన్‌‌లో ప్రమోషన్ల జోరు!..తాజా డీపీసీలో 23 మందికి చాన్స్ 

ఇరిగేషన్‌‌లో ప్రమోషన్ల జోరు!..తాజా డీపీసీలో 23 మందికి చాన్స్ 
  • ఎనిమిది మంది ఎస్‌‌ఈలకు సీఈలుగా ప్రమోషన్​
  • మరో 15 మంది ఈఈలకు ఎస్‌‌ఈలుగా పదోన్నతి

హైదరాబాద్​, వెలుగు: సాగునీటి శాఖలో ప్రమోషన్ల జోరు కొనసాగుతున్నది. తాజాగా మరో 23 మంది అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డిపార్ట్‌‌మెంటల్ ప్రమోషన్​కమిటీ (డీపీసీ) మీటింగ్​నిర్వహించి.. సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చింది. ఎనిమిది మంది సూపరింటెండెంట్​ఇంజనీర్ (ఎస్‌‌ఈ)లకు చీఫ్ ఇంజనీర్లు(సీఈ) గా,15 మంది ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్‌‌‌‌(ఈఈ)లకు ఎస్‌‌ఈలకు ప్రమోషన్లు కల్పించినట్టు తెలిసింది. ఈ  పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈఎన్‌‌సీ అడ్మిన్ తమటం శ్రీనివాస్ మంగళవారం రిటైర్​ కాగా.. ఆయన పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించినట్టు సమాచారం. 

బీఆర్‌‌‌‌ఎస్​ హయాంలో ప్రమోషన్లే లేవ్​..

బీఆర్‌‌‌‌ఎస్​హయాంలో పదేండ్లలో ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లన్నవే లేకుండా పోయాయి. అధికారంలో ఉన్నన్నాళ్లూ కేవలం ఎఫ్‌‌ఏసీలు ఇచ్చి కాలం నెట్టుకుంటూ వచ్చారు. దీంతో ఇరిగేషన్​శాఖ అస్తవ్యస్తమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్‌‌మెంట్‌‌ను స్ట్రీమ్‌‌లైన్ చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. అధికారుల ప్రమోషన్లకు నిరుడు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ఆగస్టు నుంచి ప్రమోషన్లను ఇస్తూ వచ్చింది. అవసరమైన చోట మాత్రం కొందరు అధికారులకు ఎక్స్‌‌టెన్షన్లూ ఇచ్చింది. తొలుత నిరుడు ఆగస్టు 5న 8 మంది ఎస్‌‌ఈలకు సీఈలుగా ప్రమోషన్లను కల్పించింది.

తొలి దశలో డీపీసీలో 13 మంది పేర్లను క్లియర్​ చేయగా.. మొదట 8 మందికి, ఆ తర్వాత ఆగస్టు 29న మరో ఇద్దరికి సీఈలుగా పదోన్నతిని కల్పించింది. ఇక అదే నెల 8న భారీ సంఖ్యలో అధికారులకు ప్రమోషన్లను ఇచ్చింది. ఒకేసారి 169 మందికి పదోన్నతులను కల్పించింది. 46 మంది డీఈఈలకు ఈఈలుగా ప్రమోషన్లను అందించింది. 2008 బ్యాచ్​ ఏఈఈలు ఎప్పటి నుంచో ప్రమోషన్లకు నోచుకోలేదు. ఆ డీపీసీలో వారికి కూడా అవకాశం కల్పించింది. అందులో 123 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఇలా ఇప్పటిదాకా 200 మందికిపైగా అధికారులకు ప్రభుత్వం ప్రమోషన్లను కల్పించడం విశేషం.