కేసీఆర్ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడ్తున్నడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడ్తున్నడు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • బీఆర్​ఎస్​ అడ్రస్ ​పోతున్నదన్న భయంలో ఏదేదో అంటున్నడు కేసీఆర్​పై మంత్రి ఉత్తమ్​ ఫైర్​
  • కేసీఆర్​వి పచ్చి అబద్ధాలు
  • బీఆర్​ఎస్​లో కేసీఆర్ కుటుంబం తప్ప ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్​లోకే
  • పంట నష్టపోయిన రైతులకు సాయం చేయని చరిత్ర కేసీఆర్​దే
  • రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటన

హైదరాబాద్, వెలుగు :  వాస్తవాలను వక్రీకరించడం కేసీఆర్​కే చెల్లిందని, సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘ఇప్పటికే ఆయనకు అధికారం పోయింది.. త్వరలోనే బీఆర్​ఎస్​ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుందనే ఫ్రస్ట్రేషన్​లో కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నడు. ఓ వైపు కూతురు కవిత జైల్లో ఉంది.

ఇంకో వైపు కాళేశ్వరం స్కామ్​, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వరుస స్కామ్​లు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఏమైతదోనన్న భయం కేసీఆర్ లో ఉంది” అని విమర్శించారు. కేసీఆర్ లెక్క తాము ఫామ్​హౌస్​లో లేమని, ప్రజల మధ్య ఉన్నామని తెలిపారు. సోమవారం గాంధీ భవన్​లో మంత్రి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు.

ఆ తర్వాత చిట్ చాట్ లో పలు విషయాలపై స్పందించారు. కరవు విషయంలో రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు తమ  ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే సీఎం స్థాయిలో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు సాగుతున్నాయని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు.

జాతీయ పార్టీ అంటూ పొంకణాలకు పోయి.. చివరికి పార్టీ ఉనికే లేకుండా చేసుకున్న చరిత్ర కేసీఆర్ ది. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఒక్క సీటు కూడా రాదు. టీఆర్ఎస్ ను బీఆర్​ఎస్​గా మార్చుకున్నరు.. ఇప్పుడు అది వీఆర్ఎస్  కాబోతున్నది. రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబం తప్ప.. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరుతారు” అని ఆయన​ పేర్కొన్నారు. 

జనరేటర్​తో ప్రెస్​మీట్​ పెట్టి..కరెంట్​ పోయిందంటవా?

రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ఇప్పటి వరకు 200 మందికిపైగా నేతలు బీఆర్ఎస్ ను విడిచిపెట్టి వెళ్లింది మాత్రం నిజమని తెలిపారు. కేసీఆర్ సూర్యాపేటలో జనరేటర్ తో ప్రెస్ మీట్ పెట్టి, కరెంట్ పోయిందనే తప్పుడు మాటలు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తుకు ఎంత డిమాండ్ ఉన్నా సరే.. 24 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇరిగేషన్​, పవర్​ సెక్టార్లను సర్వనాశనం చేసిండు

ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పారని, కానీ 16 వందల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ‘‘బీఆర్ఎస్  అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీపీసీకి సహకరించి ఉంటే ఇప్పుడు 4 వేల మెగావాట్ల పవర్  మన చేతిలో ఉండేది. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు ఎక్కడ నష్టం వస్తుందోనన్న ఉద్దేశంతో  ఎన్టీపీసీకి కేసీఆర్ సహకరించలేదు.

రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఈ రెండు సెక్టార్లను ఇంతగా నాశనం చేసిన వ్యక్తి మరొకరు లేరు” అని మండిపడ్డారు. మిషన్ భగీరథను గత బీఆర్​ఎస్​ సర్కార్​ కమీషన్ భగీరథగా వాడుకుందని విమర్శించారు. కమీషన్​ భగీరథగా  మారంటే ప్రతి ఇంటికి నల్లా నీరు వచ్చేదని అన్నారు.

కాళేశ్వరం గురించి కేసీఆర్ మాట్లాడుడు చాలా వికారంగా ఉంది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి కేసీఆర్​ కట్టిన ఈ ప్రాజెక్టు ఆయన హయాంలోనే కూలిపోవడం సిగ్గు చేటు. దీనికి ఆయన తలదించుకోవాలి. ఇదంతా మరిచిపోయి... ఇప్పుడు మామీద నిందలు వేస్తున్నడు” అని మంత్రి ఉత్తమ్​ ఫైర్​ అయ్యారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆరేనని, ఇవ్వబోమని చెప్పింది తమ ప్రభుత్వం అని ఆయన అన్నారు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకున్నా నోరు మెదపని నేత కేసీఆర్ అని విమర్శించారు. 

పంట బీమాఎందుకు అమలు కాలే?

దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. అందుకు కేసీఆరే కారణమని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా ...రైతులు నష్టపోతే ఒక్క పైసా సాయం చేయని సీఎం అని చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్​కు మాత్రమే దక్కుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలను పట్టించుకోని కేసీఆర్​.. ఇప్పుడు రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు బేషరతుగా కేసీఆర్క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

నా ఫోన్​ కూడా ట్యాప్​ చేశారు

‘‘పోలీసు శాఖను ఎక్కువ ఉపయోగించుకుంది కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆయనే. కానీ, ఇప్పుడు మాత్రం పోలీసులు న్యూట్రల్ గా ఉండాలని అంటున్నడు” అని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ‘‘నా ఫోన్ ను కూడా గత పాలనలో ట్యాప్  చేశారు. కానీ, దీనిపై నేను వ్యక్తిగతంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయను” అని తెలిపారు. ఫోన్​ ట్యాపింగ్​ క్షమించరాని నేరమని,  చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలు జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులు మొత్తం చిట్టాను బయటపెడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు  40 వేల కోట్ల రూపాయల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిందని,  సీఎంతో పాటు తామంతా ఇప్పుడు వాటిని క్లియర్ చేసే పనిలోనే ఉన్నామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్ కు డిపాజిట్  కూడా దక్కదన్నారు. తమ ప్రభుత్వ పనితీరు, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎంఎస్​పీ కంటే తక్కువ ధరకు కొంటే చర్యలు తప్పవు

రైతులు పండించిన ప్రతి గింజను ఎంఎస్‌‌‌‌పీకే కొంటామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఎవరైనా సరే ఎంఎస్‌‌‌‌పీ కంటే తక్కువ ధరకు ధాన్యం కొంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్రం లో 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం జరిగిపోయిందని, ఎన్నికల కోడ్ వల్ల అమలు చేయలేకపోయమని చెప్పారు. 

కేసీఆర్​..! నీలెక్క మేం ఫామ్​హౌస్​లో లేం.. ప్రజల నడుమ ఉన్నం. దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దానికి నువ్వు, నీ గత పాలనే కారణం. పదేండ్లు వరదలు, కరువుతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయమేంది?నాడు రైతుల దిక్కయినా చూసినవా?

 మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి