అధునాతన టెక్నాలజీతో..మళ్లీ ఎస్ఎల్‌‌బీసీ పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అధునాతన టెక్నాలజీతో..మళ్లీ ఎస్ఎల్‌‌బీసీ పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఎస్ఎల్‌‌బీసీ పనులు మళ్లీ మొదలుపెట్టండి
  • అది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్ట్: ఉత్తమ్
  • ఫైనాన్షియల్ క్లియరెన్స్‌‌ల కోసం సీఎం, డిప్యూటీ సీఎంతో సమావేశమవుతం 
  • ఎస్ఎల్‌‌బీసీ పూర్తికాక ఫ్లోరైడ్​పీడిత ప్రాంతాలకు నీళ్లివ్వలేకపోతున్నం 
  • పనుల పునఃప్రారంభానికి ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ, జీఎస్‌‌ఐ సర్వేలు చేయిస్తామని వెల్లడి   
  • అధికారులతో మంత్రి సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్ ​కెనాల్​(ఎస్ఎల్‌‌బీసీ) ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్ట్​ అని, దాని పనులను వెంటనే పునఃప్రారంభించాలని అధికారులను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​  రెడ్డి ఆదేశించారు. పనులను మళ్లీ మొదలు పెట్టేందుకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామని తెలిపారు. 

ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక క్లియరెన్సుల కోసం సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆర్థిక, విద్యుత్, ఇతర అనుబంధ విభాగాల నుంచి అనుమతులు తీసుకుంటామన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో అధికారులతో ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్​ కూలిన వెంటనే ఎక్స్‌‌పర్ట్​ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సుల మేరకు పనులను మొదలు పెడుతున్నామని చెప్పారు. 

‘‘టన్నెల్‌‌లో బ్యాలెన్స్​ఉన్న 9 కిలోమీటర్ల పని పూర్తయి ఉంటే శ్రీశైలం రిజర్వాయర్ ​నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకునేందుకు వీలుండేది. కానీ ప్రమాదం కారణంగా అది వీలుపడడం లేదు. టన్నెల్ ​పూర్తికాకపోవడంతో నీటిని ఎత్తిపోయడానికే ఏటా విద్యుత్ బిల్లులకే రూ.750 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది.

ఎస్ఎల్‌‌బీసీ నుంచి నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల ఫ్లోరైడ్ ​పీడిత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలపై ప్రభావం పడుతున్నది. ఈ ప్రాజెక్ట్​ 
పూర్తయితే శ్రీశైలం పూర్తిగా నిండకున్నా రిజర్వాయర్​అడుగు నుంచి నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్​ పూర్తయితే వెనుకబడిన ప్రాంతాలకు నీటిని అందించొచ్చు” అని తెలిపారు. 

అధునాతన టెక్నాలజీతో పనులు

ఎస్ఎల్‌‌బీసీ పనులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. అందులో భాగంగా తొలుత నేషనల్ ​జియోఫిజికల్ రీసెర్చ్ ​ఇనిస్టిట్యూట్​ (ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ).. హెలికాప్టర్​ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్​ సర్వే చేపడ్తుందని చెప్పారు. భూమి లోపల కిలోమీటర్​ వరకు నేల పరిస్థితులను వెల్లడించే పరికరాలతో సర్వే చేస్తారన్నారు.

 ‘‘ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్ ​చేపడుతున్న ప్రాంతం క్లిష్టమైనది. కాబట్టి అక్కడ హెలికాప్టర్ సర్వే తప్పనిసరి. దీని ద్వారా ఫాల్ట్ లైన్స్, నిర్మాణ సవాళ్లను తెలుసుకునేందుకు వీలవుతుంది. జియోలాజికల్​ సర్వే ఆఫ్​ఇండియా (జీఎస్​ఐ) ద్వారా లైడార్ ​సర్వే చేయిస్తాం. కేబినెట్​ఆమోదించిన బడ్జెట్‌ల్లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నాణ్యతలో రాజీపడేది లేదు” అని చెప్పారు. 

కాగా, సింగూరు డ్యామ్​ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్‌‌పర్ట్​ కమిటీని పంపినట్టు తెలిపారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రమాదాన్ని తప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కమిటీ నివేదిస్తుందన్నారు. అవసరమైన చోట ఇసుక బస్తాలతో రివెట్‌‌మెంట్‌‌ను పటిష్టపరచాలన్నారు. రాష్ట్రంలోని బ్యారేజీలు, డ్యామ్‌‌ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

సమ్మక్క సాగర్‌‌‌‌తో ముంపు 49 హెక్టార్లే..

పోలవరం ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులతో చత్తీస్‌‌గఢ్‌‌లో ఏర్పడే ముంపు ప్రభావంపై ఐఐటీ ఖరగ్‌‌పూర్​చేసిన స్టడీ రిపోర్టు అందిందని మంత్రి ఉత్తమ్‌‌కు అధికారులు వివరించారు. ‘‘500 ఏండ్లకోసారి రిటర్న్​ పీరియడ్​ వరద 36 లక్షల క్యూసెక్కులు వస్తే సమ్మక్క సాగర్​బ్యారేజీ వద్ద నీటి మట్టం 93 మీటర్లకు చేరుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. 

దాని వల్ల చత్తీస్‌‌గఢ్ బీజాపూర్​జిల్లాలోని కోటూరు, తార్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరం గ్రామాల్లో 10.9 చదరపు కిలోమీటర్ల భూమి ముంపునకు గురవుతుందని తేల్చారు. ఒకవేళ అక్కడ బ్యారేజీ నిర్మించకపోయినా అంతే మొత్తంలో వరద వచ్చినా గోదావరి నది లెవెల్​ 90.87 మీటర్లుగా ఉంటుందని, దాని వల్ల చత్తీస్‌‌గఢ్‌‌లోని 10.5 చరదపు కిలోమీటర్ల మేర భూములు ముంపునకు గురవుతాయని వెల్లడించారు” అని పేర్కొన్నారు. 

బ్యారేజీ కడితే అదనంగా కేవలం 49 హెక్టార్ల భూమే మునుగుతుందన్నారు. దీంతో చత్తీస్‌‌గఢ్​ నుంచి నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​తీసుకునేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని మంత్రి ​చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేవాదుల కింద ఉన్న 16.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కాగా, డిపార్ట్‌‌మెంట్‌‌లో అధికారుల 33 ఏండ్ల కల అయిన ప్రమోషన్లను నెరవేరుస్తున్నామన్నారు.  

ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ హెలికాప్టర్​ సర్వేకు రూ.2.36 కోట్లు.. 

ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్​పనులకు సంబంధించి ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐతో హెలికాప్టర్​ ద్వారా సర్వే చేయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్వే పనుల కోసం రూ.2.36 కోట్లను మంజూరు చేస్తూ శుక్రవారం ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్ ​వద్ద ఇన్వెస్టిగేషన్, డిజైన్​ అండ్​ ఎగ్జిక్యూషన్ ​పనులకు సంబంధించి హెలికాప్టర్​ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ చేపట్టనుంది.