
- పారదర్శకంగా పరిహారం, పునరావాసం ఉండాలి
- భూ సేకరణ ఎంత లేటైతే అన్ని సమస్యలు
- సమయం ఎక్కువ అయ్యేకొద్దీ ఖర్చులూ పెరుగుతయ్
- భూయజమానులతో చర్చించి ఓ కొలిక్కి తీసుకురండి
- పాలమూరు-రంగారెడ్డి, సీతారామ సాగర్‌ను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. భూసేకరణ పరిహార సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. భూసేకరణపై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, న్యాయపరమైన చిక్కులు, పాలనాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
శనివారం సెక్రటేరియెట్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. అన్ని జిల్లాల్లో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను ఆరా తీశారు. ఇరిగేషన్ కేవలం ప్రాజెక్టుల నిర్మాణాల కోసమే కాదని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆహార భద్రతకు కీలకమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఆయా ప్రాజెక్టులు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించి పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు – రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి ప్రాజెక్టులు కరువు ప్రాంతాలకు అత్యంత కీలకమని, ఆయా ప్రాజెక్టుల్లోని అన్ని దశల పనులకూ అత్యంత ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలన్నారు. కెనాల్ లైనింగ్ పనుల నుంచి టన్నెల్ బోరింగ్ పనులనూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా చేపట్టాలని ఆయన సూచించారు.
భూసేకరణ లేట్ అవుతుండడమే పెద్ద నష్టం
భూసేకరణ ఆలస్యమవుతుండడమే ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. భూసేకరణ లేట్ వల్ల సమయం ఎక్కువ అవుతుండడంతోపాటు ఖర్చులూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే భూ యజమానులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం, పునరావాసం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఎంత ఆలస్యం చేస్తే ప్రజల నుంచి అంత వ్యతిరేకత వ్యక్తమవుతుందని, న్యాయపరమైన సమస్యలు తలెత్తి ప్రాజెక్టుల పనులు పెండింగ్ పడతాయని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలన్నారు.
వరదపై అల్టర్‌గా ఉండండి
రిజర్వాయర్లకు ఎగువ నుంచి వరదలు వస్తుండడంతో అన్ని ప్రాజెక్టుల వద్ద అధికారులు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రాజెక్టుల నీటి మట్టాలను పరిశీలించాలని, ఏదైనా అవసరమైతే ఎమర్జెన్సీ ప్రొటోకాల్‌ను యాక్టివేట్ చేయాలన్నారు. ఓపెన్ కెనాల్ తవ్వలేని చోట సొరంగాల పనులు అత్యంత కీలకమని, ఈ విషయంలో డిపార్ట్మెంట్ సాంకేతిక సామర్థ్యం పెంచుకునేందుకు ఇద్దరు అత్యున్నత స్థాయి ఆర్మీ అధికారులను టన్నెల్ నిర్మాణాల్లో భాగం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇరిగేషన్ శాఖ గౌరవ సలహాదారుగా ఇండియన్ ఆర్మీ మాజీ ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్, డిపార్ట్మెంట్కు ఫుల్‌టైంగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా టన్నెల్ ఇంజనీరింగ్‌లో సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులు రోహ్తంగ్, జోజిలా సొరంగాల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని
వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ నిర్వహణలో శిక్షణ, రీసెర్చ్‌కు అది అత్యంత కీలకమన్నారు. ఆ సంస్థ భూమిపై సర్వే చేయించాలని, కబ్జాలుంటే వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను టైమ్‌కు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు.