
- ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు
చెన్నూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో గోదావరికి కరకట్టలు కట్టేందుకు రూ.200 కోట్లు విడుదల చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అన్నారం బ్యారేజీ ముంపు గ్రామాలకు చెందిన వంద మంది బాధిత రైతులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు.
నాలుగేండ్లుగా ప్రతి వానా కాలంలో కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ కారణంగా గోదావరి తీర ప్రాంతంలో పంటలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని మంత్రి ఉత్తమ్‌కు రైతులు వివరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఏనాడూ తమకు నష్టపరిహారం ఇవ్వలేదని తెలిపారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కూడా పరామర్శించిన పాపానపోలేదని అన్నారు. నష్టపరిహారం చెల్లించాలని గతంలో వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో చాలా సార్లు ఆందోళనలు చేసినా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు.
గోదావరికి కరకట్టలు కట్టి తమ పంటలను కాపాడాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరకట్టల నిర్మాణానికి రూ.200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీరెల్లి, ముత్తరావుపల్లి, సుందరశాల, నర్సక్కపేట, దుగ్నెపల్లి, వెంకంపేటతో పాటు తదితర గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివేక్‌తో పాటు మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.