ఈ లక్షణాలుంటే మీకు IBS ఉన్నట్టే...బీ అలర్ట్!

ఈ లక్షణాలుంటే మీకు  IBS ఉన్నట్టే...బీ అలర్ట్!

ఆఫీస్​లో పనిచేసే ఒక ఎంప్లాయి తన కొలీగ్స్​తో “పొట్టలో ఉబ్బరం, నొప్పి, కొన్ని రోజులు అతిసారం, మరికొన్ని రోజులు మలబద్ధకం. ఆఫీసు మీటింగ్‌ల్లో కూర్చోలేనంత ఇబ్బందిగా ఉంది” అని చెప్పాడు. వాళ్లతోపాటు అక్కడే ఉన్న అమ్మాయిల్లో ఇద్దరు తాము కూడా అదే సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. అసలు ఈ సమస్య ఏంటో వాళ్లలో ఎవరికీ అంతుపట్టలేదు. దాన్నుంచి బయటపడడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ  ఒకరితోఒకరు పంచుకున్నారు. అయితే ఈ సమస్య ఐబిఎస్​ కావొచ్చు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అసలు ఐబిఎస్​ అంటే ఏంటి?

ఐబిఎస్​.. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్.   పేగులు సరిగ్గా పని చేయకపోవడం. ఇది రోజువారీ జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్, మలంలో మార్పులు వంటివి దీని ముఖ్య లక్షణాలు. కొన్ని ఆహార అలవాట్లు, స్ట్రెస్, హార్మోన్లలో మార్పులు ఈ లక్షణాలను మరింత రెచ్చగొడతాయి. ఇది మోడర్న్ లైఫ్​ స్టయిల్, టెన్షన్, ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఐటెమ్స్ వాడకం వల్ల ఇండియన్స్​లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సరైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులతో 70 నుంచి 80 శాతం మందికి లక్షణాలు తగ్గుతాయని డాక్టర్లు అంటున్నారు. 

గట్ నుంచి బ్రెయిన్​కి రాంగ్ సిగ్నల్స్!

ఐబిఎస్​ అనేది గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్. ఎక్కువ కాలం కడుపునొప్పితోపాటు మలబద్ధకం లేదా విరేచనాలు ఉంటే ఐబిఎస్ కావొచ్చు. దీనివల్ల కడుపు నుంచి పేగులకు సమాచారాన్ని అందించే నరాలు సెన్సిటివ్ అవుతాయి. గట్ సెన్సిటివ్​గా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు.. డైట్ మారడం, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇలా జరుగుతుంటుంది. అయితే దీనికి స్పష్టమైన కారణం తెలియదు. కానీ.. యాంగ్జైటీ, స్ట్రెస్, సైకలాజికల్​గా ఇబ్బందిపడే వాళ్లకు ఐబిఎస్​ వచ్చే చాన్స్ ఉంది. 

గట్ బ్యాక్టీరియా ..

పెద్దయ్యేకొద్దీ పాలలో ఉండే లాక్టోజ్ అనే బ్యాక్టీరియాను అరిగించేందుకు ఉపయోగపడే లాక్టేజ్ ఎంజైమ్ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల పాలు సరిగా అరగకపోగా, గట్ బ్యాక్టీరియా ఆ పాలను ఫెర్మెంటేషన్ అయ్యేలా చేస్తుంది. అంటే పులియబెడుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తుతుంది. ఆల్రెడీ ఐబిఎస్​ సమస్య ఉంటే ఈ కారణాలన్నీ మరింత ఎక్కువ ప్రభావితం చేస్తాయి. సింప్టమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 

అంతేకాకుండా ఐబిఎస్​ ఉన్నవాళ్లలో యాంగ్జైటీ ఉంటుంది.. కాబట్టి వాళ్లు ఎక్కువగా భయపడుతుంటారు. కడుపులో నొప్పి వల్ల అల్సర్స్ వంటివి ఉన్నాయోమోనని బ్రెయిన్​కి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నీ పెరుగుతాయి. ఇలా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఐబిఎస్ వల్ల కాంప్లికేషన్స్ ఉండవు. శరీరానికి ఎలాంటి నష్టం జరగదు. కానీ, సమస్య మాత్రం దీర్ఘకాలం వేధిస్తుంది. 

కనుక్కోవడం కష్టమే.. 

ఏ టెస్ట్ చేసినా దాదాపు నార్మల్​ రిపోర్ట్ వస్తుంది. అందువల్ల ఐబిఎస్​ను కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. అందుకే సింప్టమ్స్​ని బట్టి అన్ని రకాల టెస్ట్​లు చేస్తారు. గట్ బ్యాక్టీరియా చేంజ్ అవ్వడానికి యాంటిబయాటిక్స్, ప్రొబయోటిక్స్ వంటివి ఉంటాయి. నరాల సెన్సిటివిటీ తగ్గించేందుకు న్యూరోమాడ్యులేటర్స్ అనే మెడిసిన్స్ లాంగ్​ టర్మ్ వాడాల్సి ఉంటుంది. 
అయితే ఐబిఎస్​ అంటే చాలామందికి తెలియక గ్యాస్​ట్రబుల్ అనుకుని టాబ్లెట్స్ వాడుతుంటారు. ఎప్పుడో ఒకసారి గ్యాస్, ఉబ్బరం వస్తే ఇంటి చిట్కాలతో నయం అయిపోతుంది అనుకుంటారు. ఎక్కువకాలం లేదా తీవ్రంగా ఉంటే కచ్చితంగా డాక్టర్​ని సంప్రదించాలి. 

ఎఫ్‌ఓడీమ్యాప్ డైట్ 

డాక్టర్లు సూచించే అత్యంత ప్రభావవంతమైన ఆహార పద్ధతి లో-– ఎఫ్‌ఓడీమ్యాప్ డైట్. ఎఫ్‌ఓడీమ్యాప్ అంటే పేగుల్లో ఈజీగా ఫెర్మెమెంటేషన్​ అయ్యి గ్యాస్, ఉబ్బరం కలిగించే కొన్ని కార్బోహైడ్రేట్లు. గట్ సెన్సిటివ్ అయినప్పుడు మన పేగులు అన్ని రకాల ఫుడ్స్​ని జీర్ణం  చేయలేవు. ఫాడ్​మ్యాప్ అంటే ఫెర్మెంటబుల్ ఆలిగో, డై, మోనో శాకరైడ్స్ అండ్ పాలిశాకరైడ్స్ అంటారు. వీటిలో  లో ఫాడ్ మ్యాప్​ డైట్​ ఫుడ్ తీసుకోమని చెప్తాం. హై ఫాడ్ మ్యాప్​ ఫుడ్స్​ని అవాయిడ్ చేయాలి. మెంటల్ హెల్త్ మేనేజ్​మెంట్, మెడిసిన్స్ వాడకాన్ని బట్టి సింప్టమ్స్ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. 


ఎఫ్‌ఓడీమ్యాప్ డైట్ అంటే..

 ఉల్లి, వెల్లుల్లి, బీన్స్, ఆపిల్, వాటర్ మెలన్​, గోధుమ ఉత్పత్తులు, లాక్టోస్ ఉన్న డైరీ ఉత్పత్తులు, క్యాబేజీ, బీరకాయ వంటివి తాత్కాలికంగా తగ్గించాలి. ఫ్రైడ్ స్నాక్స్, స్పైసీ బిర్యానీ, అధిక కాఫీ లేదా టీ, ఆల్కహాల్, కార్బొనేటెడ్ డ్రింక్స్, చాక్లెట్ నివారించాలి.

 రైస్, ఓట్స్, క్యారెట్, దోసకాయ, పాలకూర, టొమాటో, బనానా, పైనాపిల్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ,  చికెన్, ఎగ్స్, ఫిష్, వాల్ నట్స్, బాదం, పాప్​కార్న్​ వంటివి తీసుకోవచ్చు. ప్రొబయోటిక్ సప్లిమెంట్‌లు కూడా సాయపడతాయి.

బీ అలర్ట్​!

బరువు తగ్గడం, మలంలో రక్తం, రాత్రి సమయంలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు ఏ మార్పులు చేసుకోవాలన్నా డాక్టర్ సలహా తీసుకోవడం అత్యవసరం.


-  డాక్టర్ జతిన్ యేగుర్ల
సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
అపోలో హాస్పిటల్స్​
హైదరాబాద్