హైదరాబాద్ మెట్రో రైల్ లాభమా? నష్టమా?

హైదరాబాద్ మెట్రో రైల్ లాభమా? నష్టమా?

హైదరాబాద్ మెట్రో రైల్​ ఒక పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్.  అయితే,  ఖరీదు అయిన ఈ రవాణాను అందుకోలేని లక్షలాదిమంది ప్రయాణికుల వెతలు తీరక, ఉన్న అరకొర ప్రభుత్వ పెట్టుబడులు ఇక్కడే ఇరుక్కుపోయిన ఈ ఆకాశమార్గం హైదరాబాద్ నగర రవాణా సమస్యను పరిష్కరించకపోగా సమస్యను జఠిలం చేసింది. 

 హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో ఈ పద్ధతిమీదనే  ప్రజాధనం పెట్టుబడులు పెడుతూ,  ట్రాఫిక్​ సమస్యకు దానినే ఏకైక పరిష్కారంగా రుద్దుతూ, కొత్త  మెట్రో రైల్ మార్గాలు ప్రతిపాదిస్తున్నారు. ఎందువల్ల? ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ఎల్&టి సంస్థ నుంచి స్వాధీనపరుచుకుంటున్నట్టు  చేస్తున్న ప్రకటనలు వచ్చాయి.  ఇది స్వాధీనమా,  కొనుగోలా అనే విషయం ఒక పక్కన ఉంటే  ఈ మార్పువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి?  ఫేజ్- 2తో అనుసంధానం చెయ్యమని కేంద్ర ప్రభుత్వం కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఎల్&టి  మెట్రో రైలు సంస్థను అడిగింది. 

అనుసంధానం చేస్తే వ్యాపారం లాభసాటిగా మారుతుందని నమ్మకంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.  కాగా, ఆది నుంచి మెట్రోరైలులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి.  ప్రైవేటు వాటాను, ప్రైవేటుగా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పును, కుదువ పెట్టిన ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం మరోసారి డబ్బులు పెట్టి తన ఆస్తులు తానే తీసుకుంటున్నట్టున్నది.

చాలామందికి తెలియాల్సిన విషయం మెట్రో రైలు గురించి ఒకటి ఉన్నది.  రైల్ మార్గం ఎన్ని వంపులు తిరిగితే అంత ఖర్చు పెరుగుతుంది. వేగం తగ్గుతుంది,  రైలు పొడవు తగ్గుతుంది.  పలుచోట్ల వంకీలు తిరిగే ప్రధాన రోడ్డు మధ్యలో  హైదరాబాదులో మెట్రో రైల్ కట్టాలని నిర్ణయించినప్పుడు ఈ 3 రకాల పరిణామాలు వస్తాయని తెలిసి కూడా అమలు చేశారు.  ఫలితంగా పెట్టుబడి భారం పెరిగింది, ప్రయాణికుల సంఖ్య తగ్గింది, వ్యాపార నష్టాలు పెరిగాయి. 

ఇప్పుడు మెట్రో రైల్ పొడవు పెంచే అవకాశం లేదు. ప్రయాణికులు ఎక్కువ అయితే చేరవేసే సామర్థ్యం పెంచలేని పరిస్థితి నిర్ధారణ అయిపోయింది. 15 లక్షల ప్రయాణికుల కోసం కట్టిన 2,599 పిల్లర్లు వగైరా ఇప్పుడు కేవలం 5 లక్షల మందికే పరిమితం. ఒక్కొక్కటి 1.5 నుంచి 2 మీటర్లు వెడల్పు ఉన్న ఈ పిల్లర్ల వల్ల రోడ్డు వెడల్పు తగ్గిపోయింది. ఈ పిల్లర్ల వల్ల రోడ్డు ఇరుకుగా మారింది. పై మార్గాన ఎక్కువమంది ప్రయాణికులు వెళ్ళగలుగుతారు అని ఆశిస్తే ఈ పిల్లర్ల వల్ల, మలుపుల వల్ల  కింద రోడ్డు కూడా ఇరకాటం అయ్యి వాహనాల సంఖ్య కూడా పరిమితం అయ్యింది. నగర ట్రాఫిక్ సమస్య ఇంకా జఠిలం అయ్యింది.

పొంతన లేని లెక్కలు

తెలంగాణ ప్రభుత్వం మీద హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ పెద్దభారం కాబోతున్నది. ఈ భారంవల్ల ఇతర పెట్టుబడులు (రవాణాతో సహా) పెట్టే  స్తోమత తగ్గిపోతుంది. అయితే, ఈ భారం ఎంత?  తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా చెప్పాలి. L&T హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నుండి నిష్క్రమించడానికి తనంతతానుగా అనేకసార్లు ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రభుత్వమే వెళ్ళిపొమ్మంటున్నది. ఇటీవల కుదిరిన అవగాహన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్-1 మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంటుంది.

 రూ.13,000 కోట్ల రుణభారం గ్రహిస్తుంది, అదనంగా ఎల్​టీఎంఆర్​హెచ్​ఎల్​కి రూ.2,000 కోట్లు ఒకే విడత పరిష్కారంగా చెల్లిస్తుంది. అయితే ఇది కేవలం రూ.15 వేల కోట్ల ఒప్పందం కాకపోవచ్చు. ఎందుకంటే, ఎల్&టి మొత్తం రూ.27 వేల కోట్లు (రూ.5,900 కోట్ల ఈక్విటీ, రూ.7,000 కోట్ల నష్టాలు, రూ.13,000 కోట్ల అప్పుతో సహా) ఆశించింది అని వార్తలు చూశాం. ఈ మూడు కూడితే రూ.25,900 కోట్లు అవుతుంది. ఇంకా రూ.1,100 కోట్లు దేనికి? ప్రధానంగా ఆశించిన దాని కంటే రూ.12 వేల కోట్లు తక్కువకు ఎల్&టి ఎందుకు అంగీకరించింది? ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ప్రభుత్వంపై భారం

2023-–-24లో తెలంగాణా ప్రభుత్వం ఎల్&టి సంస్థతో చేసుకున్న అనుబంధ రాయితీ ఒప్పందం రూ.800 కోట్లు రుణంగా ఎల్&టి సంస్థకు ఇచ్చింది. ఈ ఋణం పరిస్థితి ఏమిటి? ఈ ఒప్పందం వివరాలు కూడా ప్రజల ముందు లేవు. ఫిబ్రవరి 2024లో ఎల్&టి సంస్థ వాటా ధనం రూ.7,413 కోట్లకు పెంచింది. వాటా పెంచిన దరిమిలా ఒక్కో షేర్ ధర రూ.10 చొప్పున మార్కెట్ నుంచి రూ.2,774 కోట్లు వాటా ధనం సేకరించింది. 2023లో రూ.10 చొప్పున మార్కెట్లో పెట్టిన 220 కోట్ల షేర్ల నుంచి పాక్షికంగా షేరుకు రూ.4 చొప్పున రూ.880 కోట్లు సేకరించింది. ఈ ధన సేకరణ వల్ల వడ్డీ భారం తగ్గింది అని ఎల్&టి చెబుతున్నది. రెండు సంవత్సరాలలో సేకరించిన మార్కెట్ షేర్ల వాటాదారులు ఎవరు? తెలంగాణా ప్రభుత్వం ఈ వాటా కూడా కొనుగోలు చేస్తున్నదా?  

మార్చి 31, 2024 నాటికి తన వార్షిక నివేదికలో పేర్కొన్న స్థూల స్థిర ఆస్తుల విలువ రూ.17,407.51 కోట్లు. నికర స్థిర ఆస్తులు రూ.15,970.06 కోట్లు. ఇది భూముల విలువ కావచ్చు. 2023-–24 సంవత్సరంలో సమకూర్చుకున్న ఆస్తుల విలువ రూ.28.24 కోట్లు. ఈ ఆస్తులు ప్రభుత్వం సేకరిస్తున్నదా లేదా స్పష్టంగా లేదు. మెట్రో రైల్ నడిపేది కియోలిస్ అనే ఒక విదేశీ టెక్నికల్ సంస్థ. మొదటి నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఈ సంస్థనే నడుపుతున్నది.  అయితే కియోలిస్ సంస్థ తన సేవలకు ఎంత ఫీజ్ తీసుకుంటున్నది తెలియదు. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థ మీద కనీసం 3 ప్రధాన సంస్థలు ఆధారపడినాయి – ఎల్&టి, హెచ్.ఎం.ఆర్, కియోలిస్. అన్ని సంస్థలు ఈ మెట్రో రైల్ వ్యవస్థలో తమకు ఆదాయం వచ్చేవరకు, లాభాలు ఉన్నంతకాలం ఉంటాయి. అవి లేనప్పుడు వెళ్లి పోతాయి. ఆఖరికి  ప్రభుత్వం నెత్తిన భారం పడుతుంది.

నష్టాలు

ఎల్&టి మెట్రో సంస్థ మెట్రో రైలు నడపడంలో నష్టాలు వస్తున్నాయని స్పష్టంగా చెబుతున్నది. అధిక మూల ధన పెట్టుబడి వల్ల ఈ నష్టాలు దీర్ఘకాలికంగా ఉంటాయని కూడా భావిస్తున్నది. ఇప్పుడున్న 67 కిలోమీటర్ల పొడవు మెట్రో వ్యవస్థ నడపడానికి 60 యేండ్ల కాలం ఉండగా ఇంకొక 54 ఏండ్లు మిగిలింది. ఇంకెన్ని యేండ్లకు నష్టాలు తగ్గి లాభాలు వస్తాయి? మొదట్లో వేసుకున్న అంచనాల ప్రకారం మెట్రో ప్రయాణికుల నుంచి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం 40 శాతం, మిగతా వ్యాపార లావాదేవీల నుంచి (వ్యాపార సముదాయం, వాణిజ్యం, అద్దె, వాణిజ్య ప్రకటనలు వగైరా) నుంచి 60 శాతం వస్తుందని అంచనా వేశారు. 

2024–25 ఆర్థిక సంవత్సరంలో, హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్ల విక్రయం (ఛార్జీల సేకరణ) ద్వారా ₹627.11 కోట్లు, వ్యాపార లావాదేవిల ద్వారా ₹481.43 కోట్లు, మొత్తం ₹1,108.54 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక్కడ నిష్పత్తి ఉల్టా అయ్యింది. 60 శాతం టికెట్ల నుంచి, 40 శాతం ఇతరత్రా. ఈ ఆదాయం నుంచి నిర్వహణ ఖర్చులు తీసేస్తే సంవత్సరానికి రూ.100---–200 కోట్లు మిగలవచ్చు. ప్రతి సంవత్సరం ఒక వంద కోట్ల మిగులు అనుకుంటే హైదరాబాద్ మెట్రో వ్యవస్థ లాభాల బాట పట్టడానికి ఇంకొక 66 ఏండ్లు పడుతుంది. అయితే, రాబోయే ఇంకొక 6 నుంచి 8 యేండ్లకు రైళ్ళు, ఇంకా ఇతర పరికరాలు మార్చి, కొత్తవి పెట్టుకోవాలి. ఆ పెట్టుబడి అదనం. ఇప్పుడున్న రూ.13 వేల కోట్ల అప్పు కూడా అదనం. 

గుదిబండ

సాంకేతిక,  ఆర్థిక,  స్థానిక, పాలకుల నిర్ణయాల మేరకు మెట్రో రైలు కేవలం 5-–6 లక్షల మందికి తప్పితే అందరికి అందని పబ్లిక్ ప్రయాణ వ్యవస్థ. తెలంగాణ ప్రభుత్వం దీనిని కొనసాగించడం, పెంచడం, విస్తృతం చేయడం విపరీత చర్యగా భావించాలి.  రాజకీయ లబ్ధికి, షోకులకు, ఇమేజింగ్ కోసం మెట్రో రైల్ ఒక సాధనంగా మారింది. ఫేజ్-1 గుదిబండగా మారిన తరుణంలో ఫేజ్-2, ఫేజ్-3లు అతి భారంగా మారతాయి. ఫేజ్-2 వలన ఫేజ్-1 భారం తగ్గుతుంది అని భావించడానికి తగిన ఆధారాలు లేవు. ఇదిలా ఉంటే నగర రవాణాకు అవసరమైన నిధులు ప్రభుత్వం పెట్టడం లేదు. 

ఎం.ఎం.టి.ఎస్ మీద రాష్ట్ర వాటా పెట్టుబడి, ఫేజ్- 2 అండ్ ఫేజ్- 3 పెట్టుబడులు పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. టి.జి.ఎస్​.ఆర్.టి.సిలో బస్సుల సంఖ్య పెంచడానికి కూడా నిధులు ఉండవు. నగరంలో దాదాపు సగం జనాభా కనీస రవాణా సౌకర్యం లేని పరిస్థితికి చేరుకుంటున్నారు.  ఈ పరిస్థితులలో హైదరాబాద్  మెట్రో రైలు మీద సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. సంక్లిష్టంగా మారిన నిర్ణయాలు సహేతుకంగా మార్చడానికి పారదర్శకత చాలా ముఖ్యం. ఒక విస్తృత సంప్రదింపుల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడితే ఒక  ఆమోదయోగ్య పరిష్కారం లభించవచ్చు.  

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​