
ఇంటి గుట్టు రట్టు కావద్దంటారు. అది నాలుగు గోడల మధ్య ఉంటేనే ఆ ఇంటివాళ్లు బయట తలెత్తుకొని తిరగగలరు. ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత పత్రికలవారి ముందు మాట్లాడుతున్న విషయాలు అందరూ ఆలకిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలెవరూ అందులో కల్పించుకోవడానికి సాహసించడం లేదు.
ఇంత దూరం వచ్చినా అదంతా వారి కుటుంబ వ్యవహారంగానే భావిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవిత అందరూ ఒకింటి మనుషులుగానే పార్టీలోని అందరు భావిస్తుంటారు.
వాళ్లలో వాళ్లు ఇవాళ అనుకోవచ్చు, రేపు ఒకటి కావచ్చు, మధ్యలో ఏ మాట అన్నా తమకే ఇబ్బంది అన్నట్లు ముఖ్యనేతలు సైతం మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్లో అంతా ఓ గంభీరమైన నిశ్శబ్దం నెలకొనివుంది.
చిక్కుల్లో పార్టీ, కుటుంబం
కవిత వరుసగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, కేటీఆర్ లకు జాగ్రత్తలు చెబుతున్నట్లుగా హరీష్, సంతోష్ లపై ఆరోపణలు చేస్తున్నా ఆ నలుగురిలో ఎవరూ మాట్లాడడం లేదు. తమ ఆడబిడ్డ కోపంలో, ఆవేశంలో ఏదో మాట్లాడుతోంది అనే ధోరణి వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వ ఆరోపణలను ఐక్యంగా, బలంగా ఎదుర్కోవలసిన సమయంలో పార్టీకి, కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి దూరం కావడం
విచారకరమే. పైగా ఆ వ్యక్తి మాటలన్నీ ప్రభుత్వ ఆరోపణలకు బలం చేకూర్చేలా, పార్టీని, కుటుంబాన్ని చిక్కుల్లో పెట్టేలా ఉండడం ఎవరూ ఊహించనిది.
కవిత ఆరోపణలు, అభియోగాల వల్ల ఆమె ఆశించినట్లు హరీష్ రావు, సంతోష్ మాత్రమే టార్గెట్ కావడం లేదు. తాను ఎంతో ఇష్టపడే ఆమె నాన్న, అన్న కేసీఆర్, కేటీఆర్ కూడా సమానంగా లేదా
వారికన్నా ఎక్కువగా ఇబ్బందుల్లో పడుతున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్లడానికి కారణం హరీష్ రావేనని ఆమె బాహాటంగా
అంటున్నారు. దానిపై ఎక్కువ మాట్లాడలేని పరిస్థితుల్లో 'అంతా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను' అనే ఒకేమాటతో హరీష్ రావు ఆగిపోయారు.
అన్ని వైపులా నిశ్శబ్దమే!
పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసినా ఆమెను వేరుగా చూసేందుకు కార్యకర్తలు ఇంకా మానసికంగా సిద్ధపడలేదు. కవిత అన్నట్లు హరీష్ రావు, సంతోష్ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందా, ఆమె కోరినట్లు వారిని పార్టీకి దూరం పెట్టడం కుదిరేనా అనే విషయాలు అంతర్గతంగా చర్చించవలసిన విషయాలు. వాటినిబయట మాట్లాడి కవిత తన అఇష్టులనే కాదు ఇష్టులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. పత్రికల్లో కవిత మాటలు, ఆరోపణలు, నిర్ణయాలపై భిన్న కథనాలు వస్తున్నాయి.
ఆమెను షర్మిలతో పోల్చినా, కొత్త పార్టీ పెడతారన్నా.. అన్నీ ఊహాగానాలే. ప్రస్తుతం అన్ని వైపులా నిశ్శబ్దమే తాండవిస్తోంది. ఇంత దూరం వచ్చిన వ్యవహారంలోనూ యూటర్న్ తీసుకొనే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో పార్టీ కన్నా కుటుంబ వ్యవహారమే ఎక్కువ. రాజకీయాల్లోనే కాదు కుటుంబ సభ్యుల్లోనూ శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆటుపోట్లు తప్పవు. వాటిని తట్టుకోవడం కష్టమే. కేసులు, జైళ్లకు కుంగిపోయేవారు, ఆత్మగౌరవానికి తగిలే దెబ్బను భరించలేనివారు ఈ ఆటలో బలహీనులే.
కేసీఆర్, కేటీఆర్‌కూ పరీక్షా కాలమే!
కవిత రాజకీయ సభల్లో ఆమె వక్తగా పాల్గొన్న సందర్భాలు తక్కువ. ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టే అవసరం రాలేదు. మహిళా నేతగా పార్టీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నా తెలంగాణ జాగృతి ఆమె నిర్వహణలోనే ఎక్కువ బిజీగా ఉండేవారు. రాజకీయ జీవితం పరిమితమైనదే. మరో పార్టీలో చేరడం, కొత్త పార్టీ స్థాపించడం లాంటి విషయాల్లో చాలా ముందు చూపు, జాగ్రత్తలు అవసరం. వేసిన అడుగు వెనక్కి తీసుకుంటే ప్రజల దృష్టిలో చులకన అయిపోతారు. ఇది కేవలం కవితకే కాదు, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా పరీక్షా కాలమే!
- బద్రి నర్సన్